Site icon NTV Telugu

CPI Narayana: బీజేపీ కుట్రల మూలంగానే మణిపూర్‌లో హింస

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే 3 నుంచి హింస కొనసాగుతోంది. గత రెండున్నర నెలలుగా మణిపూర్‌లో హింస కొనసాగుతుండగా.. హింసను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఏవీ విజయవంతం కాలేదు. గత రెండున్నర నెలలుగా హింస కొనసాగుతూనే ఉంది. ఈ రోజు సోషల్‌ మీడియాలో మహిళలపై అత్యాచారం, హత్య వీడియో వైరల్‌ కావడంతో ప్రధాని మోడీ స్పందించారు. ఈ నేపథ్యంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా ఇదే అంశంపై స్పందించారు. మణిపూర్‌ రాష్ట్రం హింసతో మండిపోతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో హింస విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌లో కొన్ని నెలలుగా అల్లర్లు జరుగుతుండగా, మ‌హిళ‌ల‌ను వివస్త్రగా చేసి లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేసిన ఉదంతం బయటికు రాగానే కేంద్రం స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్నాళ్లు మ‌ణిపూర్ అల్లర్లపై స్పందించ‌ని ప్రధాని నరేంద్ర మోడీ, పార్లమెంటు లోపల మాట్లాడాల్సిన‌ అంశాన్ని, మీడియాతో మాట్లాడటం ఏమిటని నారాయణ ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Read also: Asia Cup 2023: ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌-పాకిస్తాన్.. జులై 23న మ్యాచ్?

బీజేపీ నంబ‌ర్ వ‌న్ బ్లాక్ మెయిలింగ్ పార్టీలా మారిందని నారాయణ ఆరోపించారు. మణిపూర్‌లో అదానీ కంపెనీలకు 55 వేల ఎక‌రాల‌ భూములు కట్టబెట్టడానికే తెగల మధ్య రిజర్వేషన్ అంశాలపై కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జులై 26న దేశవ్యాప్తంగా సేవ్ మణిపూర్ పేరుతో సీపీఐ మణిపూర్‌కు మద్దతుగా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని.. కేంద్రం విభజన చట్టాలను అమలు చేయడం లేద‌న్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోవడం లేదని, కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేయాలనేది.. రైల్వే కోచ్‌ ఏర్పాటు అనేది 30, 40 ఏళ్ల కల అని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రూ. 500 కోట్లతో డబ్బా రేకులు తెచ్చి పెట్టారని విమర్శించారు. గుజరాత్‌లో రూ. 20 వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని నారాయ‌ణ‌ విమర్శించారు.

Exit mobile version