NTV Telugu Site icon

Domestic Violence: మాజీ ప్రధాని మనవరాలికి వరకట్న వేధింపులు.. కేసు నమోదు

Vp Sing Grand Daughter

Vp Sing Grand Daughter

Domestic Violence: మాజీ ప్రధాని మనవరాలికి కూడా గృహహింస, వరకట్న వేధింపులు తప్పడం లేదు. మాజీ ప్రధాని వీపీ సింగ్ మనవరాలైన అద్రిజా మంజరీ సింగ్ తాను గృహహింస ఎదుర్కొంటున్నట్లుగా డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఆర్కేష్ నారాయణ్ సింగ్ డియోతో పాటు అతని తండ్రి, కుటుంబ సభ్యులపై డెహ్రడూన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

అద్రిజా తన భర్త, అత్తమామలపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్, డెహ్రాడూన్ సీనియర్ ఎస్పీని విచారణకు ఆదేశించారు. రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్కేష్ అతని కుటుంబ సభ్యులపై ఐపీసీ సెక్షన్‌లు 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 352 రెచ్చగొట్టడం, దాడి, క్రిమినల్ ఫోర్స్), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు. భర్త అర్కేష్ తో పాటు ఆయన తండ్రి అనంగ ఉదయ్ సింగ్ డియో, హరిసింగ్, కాళికేష్ నారాయన్, రవితపై కేసులు నమోదు అయ్యాయి.

Read Also: BRS Party : మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణీ

‘‘మే 13న రాజ్ పూర్ రోడ్ లోని నా అత్తామామల ఇంటికి వెళ్లినప్పుడు, అర్కేష్ సూచనల మేరకు గార్డులు నన్ను ఇంటిలోకి అనుమతించలేదని, 40-45 నిమిషాల తర్వాత ఎలాగొలా ఇంటిలోకి వెళ్లానని, మా అత్తామామలు చెప్పినట్లు పనివాళ్లు, సిబ్బంది తనను తిట్టినట్లు, కొట్టి చంపాలనే ఉద్దేశంతో దాడి చేశారని, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నా చర్యలు తీసుకోలేదని’’ అద్రిజా వెల్లడించారు. పెళ్లయిన కొంత కాలం తర్వాత భర్త, అత్తమామలు వరకట్నం కోసం తనను మానసికంగా వేధించడం ప్రారంభించారని ఆమె ఆరోపించింది. ఎన్నికల్లో వాడుకునేందుకు నా భర్త, అత్తమామాలు నాతండ్రి ఆస్తుల్ని అమ్మాలని ఒత్తిడి చేశారని, అందుకు అంగీకరించకపోవడంతో తననను వేధించినట్లు అద్రిజా ఫిర్యాదులో పేర్కొంది.

ఇదిలా ఉంటే అద్రిజా ఆరోపణల్ని అర్కేష్ అవాస్తవమని అన్నారు. అద్రిజా 6-8 నెలల క్రితం తనపై ఫిర్యాదు చేసిందని, అప్పటి నుంచి నేను ఆ ఇంట్లో నివసించడం లేదని, మూడు రోజుల క్రితం అద్రిజా తండ్రి పలు విషయాల్లో డిమాండ్ చేసినట్లు అర్కేష్ ఆరోపించారు. ప్రస్తుతం కేసు డెహ్రాడూన్ సబ్ జడ్జి పరిధిలో ఉందని న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, త్వరలోనే నిజం తెలుస్తుందని ఆయన అన్నారు.