Site icon NTV Telugu

Love Jihad: “లవ్ జిహాద్” కేసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

Pushkar Sing Dhami

Pushkar Sing Dhami

Love Jihad: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ రాష్ట్ర పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రాష్ట్రంలోని సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన ఆయన ‘‘లవ్ జిహాద్’’పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో విభిన్న మతాలకు చెందిన వారు శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారని.. అయితే లవ్ జిహాద్ వంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. కుట్రలో భాగం ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఇప్పుడు ముందుకు వస్తున్నారని సీఎం అన్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటీవల నమోదైన లవ్ జిహాద్ కేసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు తెలుసుకునేందుకు సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. లవ్ జిహాద్‌పై అవగాహన పెరుగుతోందని.. అందుకే గత రెండు మూడు నెలలుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని.. దీనికి తీవ్రమైన మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావడం కూడా ఒక కారణమని ముఖ్యమంత్రి అన్నారు. గత కొన్ని వారాల్లో ఉత్తరకాశీ, చమోలి, హరిద్వార్ జిల్లాల్లో మైనర్ హిందూ బాలికను అపహరించే సంఘటనలు 10కిపైగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Big Breaking: దివ్యాంగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త.. పింఛన్‌ పెంపు

లవ్ జిహాద్ కు వ్యతిరేకం బయటకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోందని సీఎం అన్నారు. లవ్ జిహాద్ కేసుల్లో నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచనలు చేశామని, బయటి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడుతున్న వారి పూర్వాపరాలను ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ డ్రైవ్‌లు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ అశోక్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి పాల్గొన్నారు.

మే 26న ఉత్తరకాశీలోని పురోలాలో ఓ ముస్లింతో సహా ఇద్దరు వ్యక్తులు హిందూ బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంతో ఆగ్రహానికి దారి తీసింది. హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. బాలికను రక్షించి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఇలాంటి సంఘటనే చమోలి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరగడంతో ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ప్రాంతంలో దాదాపుగా 15 రోజుల నుంచి ముస్లింలకు సంబంధించిన వ్యాపారాలు మూతపడ్డాయి. జూన్ 15లోగా వారంతా పట్టణం వదిలి వెళ్లాలని హిందూ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి.

Exit mobile version