NTV Telugu Site icon

Char Dham Yatra: చార్ ధామ్ ఆలయాల వద్ద మొబైల్ ఫోన్లలో రీల్స్ చేయడంపై నిషేధం..

Char Dham Yatra

Char Dham Yatra

Char Dham Yatra: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ దేవాలయాల వల్ల వీడియోలు, రీల్స్ చేయడానికి మొబైల్ ఫోన్స్ ఉపయోగించడాన్ని నిషేధించింది. ఈ మేరకు చార్ ధామ్ పుణ్యక్షేత్రాలు ఉన్న జిల్లాలలో ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాధ్, కేధార్‌నాథ్ వద్ద రీల్స్, వీడియోలు షూట్ చేయడం, ప్రజల్ని నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేవాలయాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండటంతో రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో రీల్స్, వీడియోల వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆలయ ప్రాంగణాల్లో ఎవరూ వీడియోలు షూట్ చేయరాదని, రీల్స్ చేయొద్దని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Read Also: Hero Suman: అల్లు అర్జున్ ఎఫెక్ట్‌తో సీనియర్ హీరో సుమన్ విజిట్ రద్దు

ఆలయాలకు 50 మీటర్ల పరిధిలో వీడియోగ్రఫీ, రీల్స్ చేయడంపై నిషేధం విధించారు, అయితే మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం లేదు. రీల్స్ మరియు సోషల్ మీడియా కోసం మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడంపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, మతపరమైన సమావేశానికి భంగం కలిగించినందుకు ఐపిసి సెక్షన్ 296 ప్రకారం ఉల్లంఘించిన వారిపై అభియోగాలు మోపాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినవ్ కుమార్ ఆదేశించారు. మతపరమైన మనోభావాలను కించపరిచే లేదా చార్ ధామ్‌ల పవిత్రతను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించకూడదని అధికారులుకు ఆదేశాలు ఇచ్చారు.

ఆలయ ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో ఎవరూ వీడియోలు చిత్రీకరించకుండా, రీల్స్ చేయడకుండా చూసుకోవాలని సీఎం ధామి ఆదేశించినట్లు ఈ వారం ప్రారంభంలో ఉత్తరాఖండ్ సీఎస్ రాధా రాటూరి వెల్లడించారు.ఇలా చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, కాబట్టి ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. చార్ ధామ్ హిందువులకు ఎంతో ముఖ్యమైన తీర్థయాత్ర. ఈ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌కి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.