Site icon NTV Telugu

Btech Girl Love Story: సినిమాకి మించిన ప్రేమకథ.. ట్విస్టులు మామూలుగా లేవుగా!

Btech Girl Love Story

Btech Girl Love Story

Tamilnadu Btech Girl Love Story Has More Twists Than Movie: మీరు నిజ జీవితంలో ఎన్నో అనూహ్యమైన ప్రేమకథల గురించి విని ఉంటారు. అయితే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ అమ్మాయి లవ్ స్టోరీ మాత్రం సినిమాకు మించి త్రిల్లింగ్‌గా ఉంటుంది. ట్విస్టులు కూడా బాగుంటాయి. స్టోరీ చదువుతున్నంతసేపూ.. ఒక సినిమా కథలానే అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. పదండి వెళ్లిపోదాం ఆ లవ్ స్టోరీలోకి! తమిళనాడుకు చెందిన జీవిత శివకుమారి బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఒకరోజు ఈ అమ్మాయి తన కుటుంబ సభ్యులతో కలిసి.. తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లింది. అదే సమయంలో.. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి చెందిన కారాని రాజేష్‌ తిరుమలకి వెళ్లాడు. అక్కడ ఆ ఇద్దరికీ అనుకోకుండా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమకు దారితీసింది.

ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకోవడంతో.. ఇటీవల సింగరాయకొండలో జీవిత, రాజేష్ పెళ్లి చేసుకున్నారు. అయితే.. తన కుటుంబ సభ్యులు ఎక్కడ తమని విడదీస్తారోనన్న భయంతో.. జీవిత తన భర్త రాజేష్‌ను వెంటేసుకొని కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ తమకు తన ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని, తమను రక్షించాలని పోలీసుల్ని వేడుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అంతకుముందే యువతి తల్లిదండ్రులు గూడూరు పోలీస్‌ స్టేషన్‌లో తమ కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. ఈ మిస్సింగ్ కేసుని విచారిస్తున్న ఎస్సై.. ఆ జంట కొత్తపట్నంలో ఉందని తెలిసి, ఆ ఇద్దరినీ తీసుకెళ్లేందుకు కొత్తపట్నం పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. అప్పుడు గుండమాల గ్రామస్తులు కలుగచేసుకుని.. ఇద్దరూ మేజర్లేనని, వారిని తీసుకెళ్లడానికి వీలు లేదని అడ్డుకున్నారు. దాంతో.. ఆ ఎస్సై ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వారం రోజుల తర్వాత ఆ ఎస్సై మళ్లీ వచ్చాడు. అప్పుడు కూడా యువతి నిరాకరించడంతో, వెనక్కు వెళ్లిపోయాడు.

ఈ క్రమంలోనే ఆ జంట.. అక్టోబర్ 19వ తేదీన పెద్దల సమక్షంలో ఒక చర్చిలో వివాహం చేసుకున్నారు. ఇక తమని అడ్డుకునేవారు ఉండరని భావించారు. ఇంతలోనే యువతి కుటుంబ సభ్యులు ఒక పెద్ద షాక్ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం గూడూరు నుంచి 30 మంది వాహనాల్లో వచ్చి.. యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని, తిరిగి తమ ఇంటికి తీసుకెళ్లారు. గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ, ఫలితం లేకుండా పోయింది. సీన్‌లోకి సర్పంచ్ ఎంట్రీ ఇచ్చి, ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశాడు. దాంతో.. ఒంగోలులో పోలీసులు అడ్డగించి, టూటౌన్‌కు తీసుకెళ్లారు. అటు.. తన కోడల్ని ఆమె మేనమామలు, మరికొంతమంది వచ్చి, బలవంతంగా తీసుకెళ్లారని రాజేష్ తండ్రి ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Exit mobile version