NTV Telugu Site icon

వ్యాక్సినేష‌న్‌.. కేంద్రంపై సుప్రీంకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం

Supreme Court

వ్యాక్సినేష‌న్ పాల‌సీ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది సుప్రీంకోర్టు.. జ‌స్టిస్ చంద్ర‌చూడ్‌, ఎల్ఎన్ రావు, ఎస్ఆర్ భ‌ట్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్ట‌గా.. కేంద్రానికి రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల ధ‌ర‌ల్లో తేడా ఉండ‌డం.. 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సిన్లు స‌రిగా అంద‌క‌పోవ‌డం, వ్యాక్సిన్ల కోసం, ప‌లు రాష్ట్రాలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌కు పిల‌వ‌డం లాంటి త‌దిత‌ర అంశాల‌పై న్యాయ‌మూర్తులు ప్ర‌శ్నించారు.. ఈ సంద‌ర్భంగా దేశంలో అర్హులైన‌వారంద‌రికీ టీకాల‌ను ఈ ఏడాది చివ‌రిలోగా ఇవ్వ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్ర‌భుత్వం.. ధ‌ర్మాస‌నాకి సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు.. సీరం, భార‌త్ బ‌యోటెక్‌, రెడ్డీస్ ల్యాబ్ ఉత్ప‌త్తి చేస్తున్న క‌రోనా వ్యాక్సిన్లు దేశంలోని 18 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ స‌రిపోతాయ‌ని సుప్రీంకు వివ‌రించారు.. ఇక‌, ఫైజ‌ర్ లాంటి ఇత‌ర వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌తోనూ కేంద్రం సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని.. దీనిపై ఒప్పందం కుదిరితే.. అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముగిస్తుంద‌ని వెల్ల‌డించారు.

మ‌రోవైపు, వ్యాక్సిన్లు రాష్ట్రాల‌కు వేరువేరు ధ‌ర‌ల‌కు ఎందుకు అమ్ముతున్నారంటూ ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు జ‌స్టిస్ భ‌ట్.. అయితే, దీంట్లో పోటీ లేద‌ని, ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలు.. ఎక్కువ వాటా పొందుతున్నాయ‌న్న వాద‌న అవాస్త‌మ‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ చెప్పుకొచ్చారు.. మ‌రి, ఎందుకు కొన్ని రాష్ట్రాలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు టీకాల కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలుస్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు జ‌స్టిస్ చంద్ర‌చూడ్.. కేవ‌లం 45 ఏళ్లుపైబ‌డిన‌ వారికి మాత్ర‌మే ఉచిత వ్యాక్సిన్లు ఎందుకు ఇస్తున్నార‌ని మ‌రో ప్ర‌శ్న సందించిన ఆయ‌న‌.. 18 ఏళ్లు దాటిన‌వారికి ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని కూడా అడిగారు.. ఇక‌, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ర‌కంగా వ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించ‌డం ఏంటి? అని ప్ర‌శ్నించారు. వ్యాక్సినేష‌న్ కోసం కోవిన్‌లో రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రా..? మ‌రి గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యం అవుతుందా? అని మ‌రో ప్ర‌శ్న వేశారు జ‌స్టిస్ చంద్ర‌చూడ్.. మ‌రోవైపు.. కోవిన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలంటే స్లాట్లు దొర‌క‌డం లేద‌ని, ప్ర‌జ‌లు ఎంతో ఇబ్బందిప‌డుతున్నార‌న్న జ‌స్టిస్ భ‌ట్.. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎంతో మంది ఫోన్ చేసి ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ని వ్యాఖ్యానించారు.

ఇక‌, 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సిన్ ఉందా? అంటూ జ‌స్టిస్ చంద్ర‌చూడ్ ప్ర‌శ్నించ‌గా.. అవున‌ని స‌మాధానం ఇచ్చారు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా.. అయితే, కోవిన్ రిజిస్ట్రేష‌న్ ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ పెడితే,.. వేల మంది ఒకేసారి వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. దీనిని త‌గ్గించ‌డానికి ప‌ని ప్ర‌దేశాల్లోనూ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్టిన‌ట్టు తెలిపారు.. కానీ, దీనిపై జ‌స్టిస్ చంద్ర‌చూడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. వ్యాక్సినేష‌న్‌పై పాల‌సీ డాక్యుమెంట్ కావాలి.. కానీ, కేవ‌లం అఫిడ‌విట్ కాద‌న్నారు.. పాల‌సీ డాక్యుమెంట్ ఇస్తే తాము ప‌రిశీలిస్తామ‌ని తెలిపారు జ‌స్టిస్ చంద్ర‌చూడ్. కాగా, కోవిడ్‌ 19 వైరస్‌పై సుప్రీంకోర్టు సమోటొగా కేసు నమోదు చేసి విచారణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.. ఇవాళ విచారణ సమయంలో సుప్రీంకోర్టు పలు కీలక అంశాల‌ను లేవ‌నెత్తింది.