NTV Telugu Site icon

Supreme Court: నుపుర్ శర్మకు ప్రాణహాని ఉంది.. అప్పటి వరకు చర్యలు వద్దు.

Nupur Sharma

Nupur Sharma

supreme court comments on nupur sharma case: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా తనపై పెట్టిన అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించాలని సుప్రీం కోర్టును నుపుర్ శర్మ కోరింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. నుపుర్ శర్మకు పలు వర్గాల నుంచి ప్రాణహాని ఉందనే వాదనలపై సుప్రీం కోర్టు ఏకీభవించింది. ఆగస్టు 10 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆమెపై ఉన్న అనేక ఎఫ్ఐఆర్ లను ఒకటిగా కలపాలన్న ఆమె అభ్యర్థనలపై స్పందించాలని వివిధ రాష్ట్రాలను కోర్టు కోరింది. ఆగస్టు 10 వరకు విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. అప్పటి వరకు కొత్త కేసులు ఏమీ కూడా దాఖలు చేయవద్దని తీర్పు చెప్పింది. జూలై 1న గతంలో సుప్రీం కోర్టు నుపుర్ శర్మ కేసుపై విచారణ జరిపిన క్రమంలో న్యాయమూర్తులు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. తాజాగా ఈ రోజు జరిగిన విచారణలో అనుకూలంగా తీర్పునిచ్చింది.

Read Also: Nupur Sharma: నుపుర్ శర్మ వీడియో చూస్తున్న వ్యక్తిపై దాడి.. ఆరుసార్లు కత్తితో పొడిచిన దుండగులు

నుపుర్ శర్మపై న్యాయవాది మణిందర్ సింగ్ తన వాదనలు వినిపించారు. ఆమె భద్రతను నానాటికి ముప్పు పెరుగుతుందని వాదించారు. జూలై 1 విచారణ తరువాత, అజ్మీర్ దర్గా ఉద్యోగి గొంతు కోస్తానని బెదిరించడం.. మరో ఘటనలో యూపీకి చెందిన వ్యక్తి తల నరికేస్తానని బెదిరించడం వంటి సందర్భాలను ఆయన ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల్లో అనేెక ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని.. ఒకే నేరానికి అనేక ఎఫ్ఐఆర్లు ఉండకూదనేదానిపై చట్టాలు ఉన్నాయని మణిందర్ సింగ్ తన వాదనలు వినిపించారు. ఈ వాదనపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ..ఆమె జీవితాన్ని, స్వేచ్ఛను రక్షించాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. జూలై 1న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో జరుగుతన్న ఘటనలన్నింటికీ నుపుర్ శర్మ వ్యాఖ్యలే కారణం అని.. దేశానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.