NTV Telugu Site icon

Suchir Balaji: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు బాలాజీ ఆత్మహత్యపై కొత్త అనుమానాలు

Suchirbalajideath

Suchirbalajideath

సుచీర్ బాలాజీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు. ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి. భారత సంతతికి చెందిన మహా మేధావి. చిన్న వయసులోనే ఎన్నో కీర్తి ప్రతిష్టతలు గడించాడు. అగ్రరాజ్యం అమెరికాలో ఒక గుర్తింపు. ఇన్ని విశిష్టతలు కలిగిన బాలాజీ.. అతి చిన్న వయసులో.. కేవలం 26 ఏళ్లకే జీవితం ముగిసిపోయింది. ముగిసిపోవడం కాదు.. అతని మరణానికి బలమైన.. అంతుచిక్కని మిస్టరీనే ఉన్నట్లుగా పోస్టుమార్టం చెబుతోంది. కన్న తల్లిదండ్రుల వాదనలో నిజమెంత ఉంది? ఎఫ్‌బీఐ సహకరిస్తుందా? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

సుచిర్ బాలాజీ… చాట్‌జీపీటీ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’లో ఉద్యోగిగా ఉన్నారు. అయితే ఓపెన్ ఏఐ సమాజానికి హానికరం అంటూ తీవ్ర విమర్శలు చేసి తప్పుకున్నారు. అందులోంచి బయటకు వచ్చిన కొంత కాలానికే నవంబర్ 26న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో బాలాజీ విగతజీవిగా మారిపోయాడు. హఠాత్తుగా బాలాజీ ప్రాణాలు కోల్పోవడం టెక్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. అయితే పోలీసులు.. బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చి చేతులు దులుపుకున్నారు.

అయితే బాలాజీ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బాలాజీ తల్లి పూర్ణిమారావ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. తాము ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ను నియమించుకొని రెండోసారి శవపరీక్ష చేశామని ఆమె తెలిపారు. ఆ శవ పరీక్షలో పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయని వెల్లడించారు. బాలాజీ తలకు బలమైన గాయాలు ఉన్నాయని.. అంతేకాకుండా అపార్ట్‌మెంట్‌లోని బాత్రూంలో రక్తపు మరకలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఎవరితో పెనుగులాట జరిగినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయని.. వెనుక నుంచి బలంగా కొట్టడంతోనే బాలాజీ ప్రాణాలు పోయాయని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్‌ను ఎలాన్‌ మస్క్‌, భారత సంతతి నేత వివేక్‌ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు పూర్ణిమారావ్‌ ట్యాగ్‌ చేశారు. దీనిపై మస్క్‌ స్పందిస్తూ ‘అది ఆత్మహత్యలా అనిపించడం లేదు’ అని రీ పోస్ట్‌ చేశారు. బాలాజీ మరణంపై న్యాయం జరగాలని కోరారు. ఎఫ్‌ఐబీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అమెరికా, భారత ప్రభుత్వాలు సహకరించాలని పూర్ణిమారావ్‌ విజ్ఞప్తి చేశారు.

సుచిర్‌ బాలాజీ.. నాలుగేళ్ల పాటు ఓపెన్‌ ఏఐలో పరిశోధకుడిగా పనిచేశారు. గత ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఓపెన్‌ ఏఐతో లాభం కంటే.. హానికరమే ఎక్కువ అని పేర్కొ్న్నారు. అంతేకాకుండా చాట్‌జీపీటీ కాపీరైట్‌ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక 2022లో కాపీరైట్‌ ఉల్లంఘనలకు సంబంధించి అనేక పిటిషన్లు ‘ఓపెన్‌ఏఐ’పై దాఖలయ్యాయి. ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో అతడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

ఆత్మహత్యకు ముందు తన కొడుకు బాలాజీతో మాట్లాడినట్లుగా తండ్రి రామమూర్తి తెలిపారు. లాస్‌ఏంజిల్స్‌తో తన స్నేహితులతో బర్త్‌డే వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్నట్లుగా చెప్పాడు. ఆ సమయంలో చాలా సంతోషంగా ఉన్నాడని.. జనవరిలో సీఈసీ టెక్ షో కోసం లాస్ వేగాస్‌ వెళ్లాలని చెప్పినట్లుగా వివరించారు. ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చినప్పుడు.. బెదిరింపులు వచ్చాయని.. చివరికి కుట్రలో భాగంగా హత్యకు గురైనట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడి మరణంపై ఎఫ్‌బీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. యూఎస్‌లోని భారతీయ అధికారులను కూడా సంప్రదించామని, మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సుచిర్ తల్లిదండ్రులు తెలిపారు. అలాగే భారత ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Show comments