NTV Telugu Site icon

Nirmala Sitharaman: సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు.. తేల్చేసిన నిర్మలాసీతారామన్‌

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాల వాటాపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. నిర్దుష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని ఇవాళ రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. సమాధానం ఇచ్చారు నిర్మలా సీతారామన్‌.. సెస్సులు, సర్‌చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వినియోగిస్తుందని క్లారిటీ ఇచ్చారు.. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు సెస్సుల రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తాలను పట్టిక రూపంలో వివరించిన ఆమె.. 2014-15లో సెస్సుల కింద కేంద్రం వసూలు చేసిన మొత్తం 82,914 కోట్లు. అదే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెస్సుల రూపంలో వసూలైన మొత్తం 3 లక్షల 52 వేల 728 కోట్ల రూపాయలని వెల్లడించారు.

Read Also: Indians invest in Fixed Deposit: ఎఫ్‌డీలు అంటే ఇండియన్స్‌కి ఎందుకంత క్రేజ్‌..? సర్వేలో ఆసక్తికర అంశాలు..

మరోవైపు.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు చెందాల్సిన వాటాపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ఫార్ములా వివరాలపై ఎదురైన మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2020-21 నుంచి 2025-26 వరకు అమలులో ఉండే 15వ ఆర్థిక సంఘం అవార్డు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కోసం కొన్ని ప్రాతిపదికలను సూచించింది. రాష్ట్ర జనాభా సంఖ్యకు 15 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, అటవీ, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వనరులకు 45 శాతం చొప్పున వెయిటేజి ఇచ్చింది. వీటి ప్రాతిపదికపైనే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను నిర్ణయించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.. ఈ ప్రాతిపదిక ప్రకారం పన్నుల పంపిణీలో బీహార్‌కు 10 శాతం, ఉత్తర ప్రదేశ్‌కు 17 శాతం, మధ్య ప్రదేశ్‌కు 7 శాతం చొప్పున పొందగా ఆంధ్రప్రదేశ్‌ 4 శాతంకు మాత్రమే పరిమితమైందన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పన్నుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 24,460 కోట్లు, 2021-22లో 35,385 కోట్లు 2022-23లో సవరించిన అంచనాల మేరకు 38.176 కోట్లు లభించాయని వెల్లడించారు. అలాగే 2023-24 బడ్జెట్‌ అంచనాల మేరకు కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద 41,338 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నట్లు రాజ్యసభలో ప్రకటించారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.