Site icon NTV Telugu

Siddaramaiah: దసరా వేడుకల్లో సిద్ధరామయ్య రుసరుసలు.. ప్రేక్షకులపై ఆగ్రహం

Siddaramaiah

Siddaramaiah

కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించడానికి కర్ణాటక ప్రభుత్వం అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్‌ను ఆహ్వానించింది. అయితే ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రుసరుసలాడారు.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: ఈరోజు మళ్లీ జుబీన్ గార్గ్‌కు పోస్టుమార్టం.. అనంతరం అంత్యక్రియలు

ఉత్సవాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగిస్తుండగా ప్రేక్షకుల్లో గలిబిలి చోటుచేసుకుంది. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయి.. ప్రేక్షకుల్లో ఒకరిపై మండిపడ్డారు. ‘‘నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నువ్వు కొంచెం సేపు కూర్చోలేవా? కూర్చో. అది ఎవరు? నేను ఒక్కసారి చెబితే నీకు అర్థం కాలేదా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇంట్లోనే ఉండి ఉండాల్సింది.’’ అని కన్నడలో సిద్ధరామయ్య మండిపడ్డారు.

ఎవరినీ వెళ్లనియొద్దని ఒక పోలీస్ అధికారికి సిద్ధరామయ్య సూచించారు. ‘‘పోలీసులు.. వాళ్ళని వెళ్ళనివ్వకండి. మీరు అరగంట లేదా గంటసేపు కూర్చోలేరా? మీరు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరవుతున్నారు?.’’ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Uttat pradesh: చిన్న కొడుకుతో కలిసి మరిదిని పొట్టు పొట్టు కొట్టిన వదిన

మైసూరులోని రాజభవనాల నగరంలో 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఈ ఉత్సవాలు ప్రారంభించేందుకు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్‌ను ఆహ్వానించడంపై వివాదం చెలరేగింది. కన్నడ భాషను ‘‘దేవత భువనేశ్వరి’’గా పూజించడం పట్ల ముష్తాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా పాత వీడియో వైరల్ అయింది. దీంతో బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముస్లిం వ్యక్తులను.. ఇతర మతస్థులను ఎందుకు పిలుస్తున్నారంటూ ఆరోపించారు. అలానే ముష్తాక్‌కు ఇంత గౌరవం ఏంటి? అని అనేక వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమె ‘‘హిందూ వ్యతిరేకి’’, ‘‘కన్నడ వ్యతిరేకి’’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే ముష్తాక్‌ను ఆహ్వానించడంపై సిద్ధరామయ్య సమర్థించారు. దసరా ఏ ఒక్క మతం లేదా కులానికి చెందిన పండుగ కాదని.. ఇది అందరి పండుగ అని పేర్కొన్నారు. ‘‘ముష్తా్క్‌ పుట్టుకతో ముస్లిం మహిళ కావచ్చు.. కానీ ఆమె మొదట మానవురాలు. మానవులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. గౌరవించాలి. కులం, మతం ఆధారంగా ద్వేషం ఉండకూడదు. ఇది మానవత్వం లక్షణం కాదు.’’ అని సిద్ధరామయ్య సూచించారు. ‘‘మన రాజ్యాంగం లౌకికమైనదని అందరూ అర్థం చేసుకోవాలి. మనది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న సమాజం, మన మతం, కులాలతో సంబంధం లేకుండా మనమందరం భారతీయులం. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారు దానిని వక్రీకరించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులు స్వార్థపరులు.’’ అని సిద్ధరామయ్య ధ్వజమెత్తారు.

Exit mobile version