ఉదయ్‌పూర్.. ఈ మధ్య భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లైన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసిన ఉదయ్‌పూర్ పెళ్లి వీడియోలే దర్శనమిస్తున్నాయి. కళ్లు చెదిరే సెట్టింగ్‌లు.. అద్భుతమైన కళాఖండాలు.. ఎటుచూసినా అందమైన పూలతో అలంకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే మరొక ప్రపంచాన్నే సృష్టించారు. 2025లో భారతదేశంలో ఇంత ఖరీదైన పెళ్లి ఏదైనా ఉందంటే అది ఉదయ్‌పూర్‌నే. అనంత్ అంబానీ-రాధికా మార్చంట్ పెళ్లి కూడా ఏ మాత్రం సరిపోదు. అంత అద్భుతంగా నేత్ర మంతెన-వంశీ గాదిరాజుల వివాహ వేడుకలు మూడు రోజులు జరిగాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎందరో సినీ కళాకారులు తమ ఆటపాటలతో కనువిందు చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ దగ్గర నుంచి ఎందరో జాతీయ.. అంతర్జాతీయ ప్రముఖులంతా ఉదయ్‌పూర్ పెళ్లికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
తాజాగా ఉదయ్‌పూర్ వెడ్డింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దృష్టిపెట్టారు. దీంతో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు ఆశ్చర్యపోవడమే కాకుండా మతిపోయింది. ఉదయపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు నిధులు ఎలా సమకూర్చబడ్డాయని దర్యాప్తు చేయగా ఈడీ అధికారులకే దిమ్మతిరిగింది. ర్యాపిడో రైడర్ ఖాతా నుంచి రూ.331 కోట్లు మనీలాండరింగ్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ‘‘మ్యూల్ ఖాతా’’ (నేర కార్యకలాపాలకు ఉపయోగించే ఖాతాలు) ద్వారా ఈ డబ్బు తరలించినట్లుగా కనిపెట్టారు. బైక్ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఖాతాలో దాదాపు 8 నెలల్లో రూ.331 కోట్ల డిపాజిట్లు అయినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కనుగొంది. ఆగస్టు 19, 2024 నుంచి ఏప్రిల్ 16, 2025 మధ్య ర్యాపిడో డ్రైవర్ బ్యాంకు ఖాతాకు రూ. 331.36 కోట్లు వచ్చాయి. ఈ డబ్బంతా అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్నట్లుగా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక డ్రైవర్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ఒక చిన్న ప్రాంతంలో రెండు గదుల గుడిసెలో నివాసం ఉండడం చూసి అవాక్కయ్యారు. జీవనోపాధి కోసం ర్యాపిడో బైక్ నిర్వహిస్తుంటాడు. అలాంటిది అతడి ఖాతాలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చూసి అధికారులే అవాక్కైయ్యారు.
అయితే విచారణ సమయంలో డ్రైవర్ లావాదేవీల గురించి తనకేమీ తెలియదని చెప్పాడు. అంతేకాకుండా వధువు, వరుడు.. వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరో తనకు తెలియదని తెలిపాడు. దీంతో డ్రైవర్ ఖాతాను ఎవరో ‘మ్యూల్ అకౌంట్’గా ఉపయోగించి ఉంటారని అనుమానిస్తున్నారు. తరచుగా నకిలీ లేదా ప్రాక్సీ కీవైసీ పత్రాలను ఉపయోగించి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వచ్చినట్లుగా గుర్తించారు. ఇలా ఎవరు చేశారనేదానిపై దృష్టిపెట్టారు. త్వరలోనే ఆ అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకునేందుకు అధికారులు ఫోకస్ పెట్టారు. అయితే ఈ డబ్బంతా అక్రమ బెట్టింగ్‌తో ముడిపడి ఉందని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొ్న్నారు.
ఇక ఉదయ్‌పూర్‌లోని ఒక లగ్జరీ హోటల్ బుకింగ్ కోసం ముందుగానే రూ.కోటి డిపాజిట్ చేసినట్లుగా గుర్తించారు. దీని వెనుక గుజరాత్‌కు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడి సంబంధం ఉన్నట్లుగా కనిపెట్టారు. త్వరలోనే అతడ్ని కూడా ఈడీ పిలిచి విచారించనుంది.
ఇక ఈ వివాహం ఇంత గ్రాండ్‌గా నిర్వహించిన వ్యక్తి పేరు మంతెన రామరాజు. ఇతన్ని ఫార్మా కింగ్‌గా పిలుస్తారు. అమెరికా ఔషధ పరిశ్రమలో సుపరిచితమైన పేరు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంత వాసి. 1980లో అమెరికాకు వెళ్లి ఫార్మా పరిశ్రమలు స్థాపించాడు. అమెరికాతో పాటు స్విట్జర్లాండ్, భారత్‌లో అనేక పరిశ్రమలు ఉన్నాయి. అయితే కుమార్తె నేత్ర మంతెన వివాహాన్ని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
