Railway Group D Recruitment 2026: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) త్వరలో సుమారు 30,000 గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని దైనిక్ జాగరణ్ కథనం వెల్లడించింది. దీపావళికి ముందే సంక్షిప్త నోటీసు విడుదల కావచ్చని, పండుగ తర్వాత పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ట్రాక్ మెయింటెయినర్లు, పాయింట్స్‌మెన్ పోస్టులు
ఈ నియామకాల్లో ట్రాక్ మెయింటెయినర్లు, పాయింట్స్‌మెన్‌తో పాటు ఇతర సాంకేతిక, సాంకేతికేతర విభాగాలకు చెందిన పోస్టులు ఉండే అవకాశం ఉంది. అయితే, పోస్టుల కచ్చితమైన సంఖ్య, విభాగాల వారీగా ఖాళీల వివరాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టమవుతాయి.
నవంబర్, డిసెంబర్‌లో దరఖాస్తుల ప్రక్రియ?
అందిన సమాచారం ప్రకారం.. ప్రతిపాదిత నియామకాలకు సంబంధించి అన్ని జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్లు తమ వద్ద ఉన్న ఖాళీల వివరాలను సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను పరిశీలించిన అనంతరం మొత్తం ఖాళీల సంఖ్యను ఖరారు చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య నిర్వహించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. రైల్వే నియామక క్యాలెండర్‌కు అనుగుణంగా డిసెంబర్‌లోపు నియామక ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా 2027లో చేపట్టాల్సిన తదుపరి గ్రూప్-డి నియామక చక్రానికి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా ఆలస్యం కాకుండా ఉండే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో సీబీటీ?
గ్రూప్-డి నియామకాలకు సంబంధించిన మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో నిర్వహించే అవకాశం ఉందని నివేదిక సూచిస్తోంది. అయితే పరీక్ష తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక, వయోపరిమితి, విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు, పరీక్ష తేదీలు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసే సమగ్ర నోటిఫికేషన్‌లో వెల్లడికానున్నాయి. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. నోటిఫికేషన్, దరఖాస్తుల తేదీలు, పరీక్ష షెడ్యూల్‌కు సంబంధించిన తాజా సమాచారం కోసం సంబంధిత ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలి.

