NTV Telugu Site icon

Puja Khedkar: మరో వివాదంలో పూజా.. ఓవరాక్షన్‌కు పోయి కష్టాలు కొనితెచ్చుకున్న ఐఏఎస్

Ias

Ias

దేశంలో అత్యంత కష్టమైంది సివిల్స్ పరీక్షలే. కఠోర దీక్షతో చదివితేనే తప్ప ఈ అత్యున్నతమైన ఐఏఎస్.. ఐపీఎస్ పోస్టులను సాధించలేరు. ఈ ఉద్యోగాలు పొందడం ఆషామాషీ విషయం కాదు. అంత కష్టమైన ఉద్యోగాల్ని సాధించాక.. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత అణకువ.. మెలకువగా ఉండాలి.. అలాంటిది ఓ ట్రైనీ ఐఏఎస్.. ఆడంబరాలకు పోయి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంది. అది కాస్త.. మరో కొత్త వివాదాదానికి తెరలేపింది. ప్రస్తుతం ఈ యవ్వారం మీడియాలో రచ్చ చేయడంతో యువ అధికారి నానా తంటాలు పడుతోంది.

పూజా ఖేద్కర్‌ పూణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రొబేషనరీ స్థాయిలో ఉన్నారు. ట్రైనీగా ఉన్నప్పుడు ఆమెకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ ఆమె మాత్రం దర్పం అనుభవించాలని కోరుకుంది. అంతే తడువుగా కలెక్టరేట్‌లో ఉండే కింది స్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. అంతటితో ఆగకుండా బెదిరింపులకు కూడా పాల్పడింది. ఇందుకు సంబంధించిన వాట్సాప్‌ చాట్‌ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక కలెక్టరేట్‌లో ఒక ముఖ్యమైన అధికారి కార్యాలయాన్ని వాడుకోవడం.. అక్కడున్న ఫర్నీచర్‌ను బయటపడేసి.. తనకు సంబంధించిన వస్తువుల్ని తెచ్చిపెట్టుకోవడం.. ఇలా వగేరా వస్తువుల్ని తెచ్చుకుని తన ఆఫీసుగా మార్చేసుకుంది. అంతటితో ఆగకుండా ప్రైవేట్ ఆడి కారు, ఎరుపు-నీలం బెకన్ లైట్, వీఐపీ నంబర్ ప్లేట్‌.. కారుపై ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే బోర్డును కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక అంతటితో ఆగకుండా తన తండ్రి దిలీప్ ఖేద్కర్‌‌ను కార్యాలయానికి తీసుకొచ్చి సిబ్బందిని బెదిరించింది. అన్ని ఏర్పాట్లు చేసేలా తండ్రితో ఆదేశాలు ఇప్పింది. దిలీప్.. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంచి పొజేషన్‌లో ఉద్యోగ విరమణ చేశాడు. ఆ చొరవతో ఓవరాక్షన్ చేశాడు. ఇలా అధికార దుర్వినియోగానికి ఆమె పాల్పడింది. ఆమె చేష్టలతో విసిగిపోయిన కలెక్టరేట్ సిబ్బంది.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వేటు వేశారు.

పూజా పూణె నుంచి వాషిమ్‌‌కు బదిలీ అయింది. పూజా ఖేద్కర్ 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్. ట్రైనింగ్ పూర్తయ్యే వరకు వాషిమ్‌లోనే ఉండాలని ఆదేశాలు వెళ్లాయి. అంటే జూలై 30, 2025 వరకు అక్కడ ‘సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్’గా పని చేయాల్సి ఉంది.

ఈ వివాదం రచ్చకెక్కడంతో కొత్తగా మరో సమస్యలో పూజా చిక్కుకుంది. ఐఏఎస్‌గా ఎన్నిక అయ్యాక ఆమె మెడికల్ టెస్టులకు హాజరుకాకపోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు యూపీఎస్సీకి వెళ్లాయి. 8 రకాలైన టెస్టులకు హాజరుకాకుండానే ఆమె ట్రైనింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఆమెకు కంటి, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆమె ఆ పరీక్షలకు ఆరుసార్లు డుమ్మాకొట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఎంఆర్ స్కానింగ్‌ కూడా హాజరుకాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.