Site icon NTV Telugu

Post Office PPF Scheme: పోస్ట్ ఆఫీస్ లో అద్భుతమైన పథకం.. రూ. 12,500 డిపాజిట్ చేస్తే..

Untitled Design (3)

Untitled Design (3)

పోస్ట్ ఆఫీస్ దేశవ్యాప్తంగా అన్ని వయసుల వారికి అనువైన అనేక చిన్న పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకాలు మంచి వడ్డీ రేట్లను అందించడమే కాకుండా, పెట్టుబడికి ప్రభుత్వ హామీ ఉండడం వల్ల పూర్తిగా సురక్షితమైనవిగా నిపుణులు చెబుతున్నారు. చిన్న మొత్తాలతో పొదుపు ప్రారంభించి, దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని సంపాదించాలనుకునే వారికి ఈ పథకాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి.

మీ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రతి నెలా పొదుపు చేస్తూ, ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడులు పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకాలు బెస్ట్ ఎంపికగా చెప్పవచ్చు. ఈ పథకాలలో ముఖ్యంగా తక్కువ రిస్క్‌తో పాటు పన్ను మినహాయింపులు అందించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం పెట్టుబడిదారులలో అత్యంత ప్రజాదరణ పొందింది.

ప్రస్తుతం ప్రభుత్వం PPF పథకంపై సంవత్సరానికి 7.1 శాతం పన్ను రహిత వడ్డీని అందిస్తోంది. ఇది అధిక పన్ను శ్లాబ్‌లో ఉన్న వారికి కూడా ఎంతో లాభదాయకమైన పథకం. PPF పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకానికి 15 సంవత్సరాల లాక్-ఇన్ కాలం ఉండగా, కనీసంగా సంవత్సరానికి రూ. 500తో ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

PPF ఖాతా మెచ్యూరిటీ అయిన 15 సంవత్సరాల అనంతరం కూడా ఈ ఖాతాను కొనసాగించాలనుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రతి సారి ఐదు సంవత్సరాల చొప్పున ఖాతాను పొడిగించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పెట్టుబడిదారులు మరింత లాభాలను పొందవచ్చు.

ఈ పథకం ద్వారా మీరు నెలకు రూ. 12,500 చొప్పున పెట్టుబడి పెడితే, సంవత్సరానికి రూ. 1.50 లక్షల గరిష్ట పెట్టుబడితో 15 సంవత్సరాలలో మీ మొత్తం డిపాజిట్ రూ. 22,50,000 అవుతుంది. ప్రస్తుతం ఉన్న 7.1 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం, ఈ కాలంలో మీరు పొందే వడ్డీ మొత్తం సుమారు రూ. 18,18,209 ఉంటుంది. ఫలితంగా మెచ్యూరిటీ సమయంలో మీకు అందే మొత్తం సుమారు రూ. 40,68,209 అవుతుంది. ముఖ్యంగా ఈ మొత్తం పూర్తిగా పన్ను రహితమే కావడం ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.

Exit mobile version