NTV Telugu Site icon

MP Fraud: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ బురిడీ.. కేటుగాడు అరెస్ట్

Madhyapradesh

Madhyapradesh

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ ఓ కేటుగాడు అధికారులనే బురిడీ కొట్టించాడు. ఉద్యోగాల్లో పదోన్నతలు కల్పిస్తానంటూ మోసాలకు తెగబడ్డాడు. అతగాడి బండారం బయటపడడంతో నిందితుడు పుష్పేంద్ర దీక్షిత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పుష్పేంద్ర దీక్షిత్ శర్మ పలువురు కేంద్రమంత్రులతో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి తాను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ కలరింగ్ ఇచ్చాడు. అతగాడి మాయలో పడ్డ ఉద్యోగులు పదోన్నతలు కల్పించాలంటూ కాసులు సమర్పించారు. అనంతరం మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని గ్రామమైన ఉదల్‌పటా టేకాన్‌పూర్‌లో పోలీసులు అతనిని పట్టుకున్నారు. పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 8 వరకు రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే బదిలీల కోసం మోసగాడిని సంప్రదించినందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇద్దరు టీఐలను సస్పెండ్ చేశారు.

నిందితుడు పుష్పేంద్రకు గతంలో నేర చరిత్ర ఉంది. 2016 డిసెంబర్‌లో బిఎస్‌ఎఫ్ ఉద్యోగుల బదిలీల కోసం అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కార్యాలయం ద్వారా సెమీ అధికారిక లేఖలు పంపగా అవి నకిలీవని తేలింది. అప్పుడు దక్షిణ ఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో పరారీలో ఉన్నాడు. అతని దగ్గర నుంచి 5 మొబైల్ ఫోన్లు, 1 లక్ష నగదు, అనేక ఆధార్ కార్డులు మరియు వివిధ విభాగాలకు సంబంధించిన ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.