NTV Telugu Site icon

PM Modi US Visit: ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య చర్చకు రానున్న అంశాలు ఇవే..

Pm Modi Us Visit

Pm Modi Us Visit

PM Modi US Visit: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఈ భేటీపై భారత్‌తో పాటు అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘‘కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మూడు వారాల్లోనే ప్రధాని మోడీని అమెరికా సందర్శించమని ఆహ్వానించడం భారత్-అమెరికా భాగస్వామ్య ప్రాముఖ్యతను చూపిస్తుంది.’’ అని అన్నారు. ‘‘వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం, ఉగ్రవాద నిరోధకత, ఇండో-పసిఫిక్ భద్రత,’’ వంటి అంశాలు ఇరు దేశాధినేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

* వాణిజ్యం-సుంకాలు:

ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత పలు దేశాలను సుంకాల పేరుతో బెదిరిస్తున్నారు. కెనడా, మెక్సికోలపై సుంకాలను విధించారు. అమెరికా ఫస్ట్ అనే వైఖరికి ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే, పలు సందర్భాల్లో భారత్ కూడా భారీగా సుంకాలు విధిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మోడీ భారత్‌పై సుంకాల విధింపును నిరోధించడం పర్యటన ప్రధాన ఉద్దేశం కావచ్చు.

2017లో అమెరికా అధ్యక్షుడిగా తన మొదటి పదవీ కాలంలో వాణిజ్య అడ్డంకులు, మార్కెట్ యాక్సెస్ సమస్యలను పేర్కొంటూ ట్రంప్ పరిపాలన 2019లో భారతదేశం యొక్క జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP)ని రద్దు చేయడం భారతదేశ సంబంధాలను గణనీయంగా ప్రభావితం చేసింది. దీంతో భారత్ హై ఎండ్ మోటార్ బైక్స్‌పై దిగుమతి పన్నులు తగ్గించాలనే ట్రంప్ డిమాండ్‌కి కట్టుబడి 1,600 సిసి కంటే ఎక్కువ ఇంజిన్లు కలిగిన హెవీవెయిట్ బైక్‌లపై సుంకాలను 50 శాతం నుండి 30 శాతానికి మరియు చిన్న మోడళ్లపై 40 శాతానికి తగ్గించింది.

* అమెరికాలో అక్రమ భారతీయులు

అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఇటీవల ట్రంప్ 104 మంది అక్రమ భారతీయ వలసదారుల్ని బహిష్కరించింది. అమెరికా సైనిక విమానం వీరిని అమృత్ సర్ తీసుకువచ్చింది. భారత అక్రమ వలసదారుల్ని భారత్ తీసుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. అక్రమవలసదారుల్ని తీసుకోవడంలో ప్రధాని మోడీ సరైనది చేస్తారని ట్రంప్, మోడీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అన్నారు.

* జన్మహక్కు పౌరసత్వం

ట్రంప్ వచ్చిన తర్వాత ‘‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’’ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది భారతీయులను షాక్‌కి గురిచేసింది. ముఖ్యంగా H1-B వీసాదారులకు అనిశ్చితిని సృష్టించింది. H1-B వీసాలపై అక్కడ పనిచేసే భారతీయ జంటలకు పిల్లలు పుడితే, ఇకపై అమెరికన్ పౌరసత్వం అనేది కష్టమవుతుంది. అయితే, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో చాలా మంది భారతీయ తల్లిదండ్రులు, తమ నవజాత శిశువుల కోసం భారతీయ పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకోవాలా..? వద్దా..? అనే గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. మోడీ, ట్రంప్ మధ్య ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

* ద్వైపాక్షిక సంబంధాలు

ట్రంప్, మోడీ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా మెరుగవుతాయని అంతా ఆశిస్తున్నారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం, ఉగ్రవాద నిరోధకత, ఇండో-పసిఫిక్ భద్రత అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.