PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!

Pm Modi Diwali 2025

Pm Modi Diwali 2025

PM Modi: దీపావళి పర్వదినం వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతి ఏటా దేశం గర్వించే వీర జవాన్ల సమక్షంలో పండుగ జరుపుకునే తన సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కుటుంబాలకు దూరంగా గడ్డకట్టే చలిలో దేశ రక్షణే ధ్యేయంగా నిలిచే సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడమే తనకు అసలైన వేడుక అని ప్రధాని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియో సందేశంలో ఆయన దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం యావత్ దేశం దీపాల కాంతులతో ధగధగలాడుతోందని, ఈ వెలుగుల పండుగ చీకటిపై మన సంకల్పానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. “దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మీ జీవితాలు సుఖశాంతులు, శ్రేయస్సుతో నిండాలి. నేను కూడా మీ అందరిలాగే ఎంతో ఉత్సాహంగా దీపావళి జరుపుకుంటాను. అయితే ప్రతి సంవత్సరం సరిహద్దుల్లోని మన వీర జవాన్ల మధ్యకు వెళ్లడం నా నిత్యకృత్యం. ఆ ఆనవాయితీ ఈసారి కూడా కొనసాగుతుంది” అని ప్రధాని వెల్లడించారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతీ దీపావళిని సైనికులతోనే గడపడం మోడీకి అలవాటుగా మారిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఈసారి కూడా ఆయన జవాన్లతో కలిసి వేడుకల్లో పాలుపంచుకోనున్నారు.

దీపావళి సంబరాల నేపథ్యంలో ప్రధాని మోడీ ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లిన ప్రధాని ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు, ఫొటోలను ప్రధాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీపావళికి ముందు వచ్చిన ధన్‌తేరస్ సందర్భంగా కూడా ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. దేవతలు, రాక్షసులు సైతం ఆరాధించే ఆదిదేవుడు, ఆయుర్వేద అధిపతి ధన్వంతరి కృపతో దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వృద్ధాప్యం, రోగాలు, భయం, మృత్యు భయాలను దూరం చేసే దివ్య ఔషధాలను అందించిన ధన్వంతరి ప్రతి ఇంటా ఆనందపు దీపాన్ని వెలిగించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పండుగ వేళ రాజకీయాలకు అతీతంగా సరిహద్దు వీరులకు పెద్దపీట వేస్తూ ప్రధాని మోడీ చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. జవాన్ల త్యాగాలను స్మరిస్తూ మోడీ పంచుకున్న వీడియో సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.