Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17న తన 75వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించిన మోడీ, దేశ రాజకీయ చరిత్రలో కీలక మలుపులు తిప్పిన నాయకుడిగా నిలిచారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా సేవా పక్వాడ పేరుతో దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు – అంటే గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి వరకు – ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
సేవా పక్వాడ లక్ష్యం
సేవా పక్వాడ కేవలం రాజకీయ వేడుక మాత్రమే కాదు. ప్రజలలో సేవాభావాన్ని పెంచడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, పర్యావరణ సంరక్షణ, ఆరోగ్యంపై దృష్టి సారించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. సేవే మన ధర్మం అనే నినాదంతో బీజేపీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తోంది. తొలిసారి ప్రధానమంత్రిగా పోటీ చేసిన సమయంలో నేను మీ ప్రధాన సేవకుడిని అంటూ మోడీ చేసిన కామెంట్స్ ను పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
సేవా పక్వాడలో చేపట్టబోయే ప్రధాన కార్యక్రమాలు
1. రక్తదాన శిబిరాలు: ప్రతి జిల్లా, మండల స్థాయిలో రక్తదానం శిబిరాలు నిర్వహించబడతాయి. పేదలకు, అవసరంలో ఉన్న రోగులకు ఇది ముఖ్య సహాయం కానుంది.
2. ఆరోగ్య శిబిరాలు: ఉచిత ఆరోగ్య తనిఖీలు, వైద్య సహాయం, మందులు అందించే శిబిరాలు ఏర్పాటు అవుతాయి. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
3. శుభ్రత కార్యక్రమాలు: స్వచ్ఛ భారత్ స్పూర్తితో వీధులు, గ్రామాలు, పట్టణాలలో శుభ్రతా డ్రైవ్ లు నిర్వహిస్తారు.
4. యువత కోసం నమో యువ రన్ ఫిట్‌నెస్, డ్రగ్ వ్యసనాల నుంచి దూరం, ఆరోగ్యకర జీవన విధానం కోసం బీజేపీ యువజన మోర్చా పలు నగరాలలో నమో యువ రన్ పేరుతో మారథాన్ ర్యాలీలు నిర్వహించనుంది.
5. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, దేశవ్యాప్తంగా చెట్లు నాటడం ప్రత్యేక కార్యక్రమంగా చేయనున్నారు.. అమ్మ పేరుతో ఒక మొక్క అంటూ మరోసారి ప్రచారం చేస్తున్నారు
6. ప్రదర్శనలు, పోటీలు: ప్రధాని మోడీ జీవితం, ఆయన ఆలోచనలను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్లు, చిత్రలేఖన, క్రీడా పోటీలు, వ్యాసరచన పోటీలు
7. స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం: “వోకల్ ఫర్ లోకల్” నినాదంతో ఖాదీ, హస్తకళ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రచారాలు జరుగుతాయి.
8. ప్రభుత్వ పథకాల అవగాహన: పేదలు, బలహీన వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రత్యేక శిబిరాల ఏర్పాటు
