పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ‘పీఎఫ్ 3.0’ పేరుతో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వ్యవస్థను మరింత డిజిటల్‌గా, సులభతరంగా మార్చడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.
కొత్త నిబంధనలతో పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ మరింత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్ సేవలు మరింత మెరుగవడంతో ట్రాన్స్‌ఫర్‌లు, క్లెయిమ్‌లు, బ్యాలెన్స్ వివరాలు తక్షణమే తెలుసుకునే విధంగా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులకు మరింత సౌలభ్యం, స్పష్టత లభించనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పీఎఫ్ ఖాతాలోని డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకునేలా కేంద్రం కీలక మార్పులు చేస్తోంది. గతంలో ఉన్న ఉపసంహరణ పరిమితులను సవరించి, అవసరమైనప్పుడు వెంటనే నగదు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇకపై పీఎఫ్ సొమ్మును ఏటీఎం కార్డులు, యూపీఐ ద్వారా కూడా తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త విధానం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇంతకుముందు ఉద్యోగం మానేసిన తర్వాత ఒక నెల పూర్తయిన తరువాత మాత్రమే పీఎఫ్ బ్యాలెన్స్‌లోని 75 శాతం సొమ్మును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. మిగిలిన 25 శాతం మొత్తాన్ని తీసుకోవాలంటే రెండు నెలల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. అయితే తాజా మార్పులతో ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్‌లోని 75 శాతం మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. మిగిలిన మొత్తాన్ని 12 నెలల తర్వాత పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.
అదేవిధంగా, గతంలో విద్య, వివాహం లేదా ఇతర అవసరాల కోసం పీఎఫ్ సొమ్ము తీసుకోవాలంటే సంబంధిత ఆధార పత్రాలు సమర్పించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేకుండా విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
