పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఇక ఉభయ సభల్లో ప్రధాని మోడీ ప్రసంగంతో మొదటి సమావేశాలు ముగుస్తాయి.
గత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అదానీ లంచాల వ్యవహారంతో ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ఒక్కరోజు కూడా సరిగ్గా సమావేశాలు జరగలేదు. ప్రతిపక్షాల ఆందోళనలు, నిరసనలతోనే సమావేశాల సమయం వృధా అయిపోయింది. మరోసారి బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈసారి సమావేశాలు ఎలా జరుగుతాయో చూడాల్సి ఉంది.
ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వాలకు తాయిలాలు ఉండొచ్చని సమాచారం. బీహార్, ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీహార్‌కు బడ్జెట్‌లో ప్రత్యేక స్థానం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.