Site icon NTV Telugu

Parameswaran Iyer: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అయ్యర్

Parameswaran Iyer

Parameswaran Iyer

నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ పరమేశ్వరన్ అయ్యర్ నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. భారత ప్రభుత్వ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయ్యర్ ను క్యాబినెట్ నియామకాల కమిటీ నియమించింది. జూన్ 30, 2022 వరకు అమితాబ్ కాంత్ పదవీ కాలం ఉంది. ఆ తరువాత అయ్యర్ రెండేళ్ల కాలానికి కొత్త సీఈవోగా బాధ్యతలు చేపడుతారు.

1981 ఐఏఎస్ బ్యాచ్, యూపీ క్యాడర్ కు చెందిన పరమేశ్వరన్ అయ్యర్ గతంలో అనేక కీలక స్థానాల్లో పనిచేశారు. నిజానికి ఫిబ్రవరి 17,2016న రెండేళ్ల కాలానికి నీతి ఆయోగ్ సీఈవోగా అమితాబ్ కాంత్ నియమితులయ్యారు. ఆ తరువాత 2019, 2021లో అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడగించింది. తాజాగా ఈయన జూన్ 30, 2022లో పదవి నుంచి దిగిపోనున్నారు. ప్రస్తుతం పరమేశ్వరన్ అయ్యర్ రెండేళ్ల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదవిలో కొనసాగనున్నారు.

శ్రీనగర్ లో జన్మించిన అయ్యర్ డెహ్రాడూన్ లోని డూన్ స్కూళ్లో విద్యను అభ్యసించారు. ఆ తరువాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివారు. నార్త్ కరోలినాలోని డేవిడ్ సన్ కాలేజీలో ఒక ఏడాది ఎక్స్ఛేంజ్ స్కాలర్ షిప్ పొందరు. 1981లో సివిల్ సర్వీసుల్లో చేరారు. వరల్డ్ బ్యాంక్ నీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో చేరడానికి 2009లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. 2016లో బహిరంగ మలవిసర్జన నిర్మూలన కార్యక్రమంలో, ఘన వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాల కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరమేశ్వరన్ అయ్యర్ ను నియమించింది.

Exit mobile version