ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది హైకోర్టు… ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో పనివేళ సమయంలో మొబైల్ ఫోన్లు వాడడం, పనులపై వచ్చే ప్రజలను పట్టించుకోకపోడం.. కార్యాలయాల్లో ఏకంగా మొబైల్ గేమ్‌లు ఆడుతున్నారు అంటూ ఎన్నో విమర్శలు ఉన్నాయి.. ఇక, సెల్‌ఫోన్ వాడడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం అయిపోయింది.. పిల్లలు మొదలు పండు ముసలి వరకు సెల్‌ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది.. అయితే, పనివేళల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్ వాడడంపై అంభ్యంతరం వ్యక్తం చేసింది మద్రాస్ హైకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు..
Read Also: KCR: డబుల్ ఇంజన్ కాదు.. అది ట్రబుల్ ఇంజన్.. కేసీఆర్ కౌంటర్
ఈ విషయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణియన్ ఆదేశాలు జారీ చేశారు.. దీనిపై వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని, రూల్స్ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.. ఆఫీసు వేళల్లో పబ్లిక్ సర్వెంట్లు మొబైల్ ఫోన్లు వాడడం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారిందన్నారు జస్టిస్ ఎస్ ఎం సుబ్రమణ్యం… కార్యాలయం లోపల మొబైల్ ఫోన్లు ఉపయోగించడం లేదా వీడియోలు తీయడం దారుణమైన విషయంగా పేర్కొన్నారు.. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు తమ వ్యక్తిగత అవసరాల కోసం కార్యాలయంలో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకూడదన్నారు. ఏదైనా అత్యవసర కాల్‌కు హాజరు కావాలంటే, మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడానికి కార్యాలయం నుండి బయటకు వెళ్లడానికి ఉన్నతాధికారుల నుండి సరైన అనుమతి పొందాలని స్పష్టం చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో మొబైల్ ఫోన్‌లు సాధారణ క్లోక్‌రూమ్‌లో ఉండేలా చూసుకోవడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తగిన సర్క్యులర్ / సూచనలు ఇవ్వాలని.. అత్యవసర కాల్స్ కోసం, కార్యాలయంలో ఉంచిన అధికారిక నంబర్లను ఉపయోగించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు న్యాయమూర్తి.
ఎట్టి పరిస్థితుల్లోనూ, కార్యాలయానికి హాజరయ్యే ప్రజలకు, అలాగే కార్యాలయంలో పనిచేసే ఇతర అధికారుల విధులకు ఇబ్బంది కలిగించకుండా మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని లేదా వైబ్రేషన్ / సైలెంట్ మోడ్‌లో ఉంచాలని.. ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస క్రమశిక్షణ పాటించాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కార్యాలయ సమయంలో కార్యాలయ ఆవరణలో మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ కెమెరాల వినియోగాన్ని నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులందరికీ తగిన సర్క్యులర్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇక, అలాంటి మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమాలు, 1973 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది హైకోర్టు. తిరుచ్చి జిల్లాలోని ప్రాంతీయ వర్క్‌షాప్ లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డీఎస్ రాధిక తన సస్పెన్షన్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు.. ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా, పిటిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులను వీడియో తీస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
