వైద్య విద్యలో పీజీ చేసేందుకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ 2022 ఫలితాలను విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈమేరకు నీట్ పీజీకి అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే రికార్డుస్థాయిలో నీట్ పీజీ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ఎగ్జామినేషన్ఇన్ మెడికల్ సైన్సెస్‌ను(NBEMS) కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ ప్రశంసించారు.
నీట్ పీజీ పరీక్షను మే 21న దేశవ్యాప్తంగా 849 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 1,82,318 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nbe.edu.inలో తమ ఫలితాలను చెక్ చేసుకోవాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) వెల్లడించింది. అభ్యర్థులు స్కోర్ కార్డులను సైతం nbe.edu.in వెబ్ సైట్‌లో ఈనెల 8 నుంచి చూసుకోవచ్చు. అభ్యర్థులు నీట్ పీజీ పరీక్షకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కులను సైతం అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
