Site icon NTV Telugu

NavIC: ఇబ్బందుల్లో స్వదేశీ GPS వ్యవస్థ ‘‘నావిక్’’.. 11 శాటిలైట్లలో 3 వర్కింగ్..

Navic

Navic

NavIC: భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ ‘‘ NAVIC ’’ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం 11 శాటిలైట్లలో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ శాటిలైట్లలో ఒకటి 10 ఏళ్ల కన్నా పాతది కాబట్టి ఎప్పుడైనా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. నావిక్ కోసం కనీసం 4 శాటిలైట్లు అవసరం. కానీ ప్రస్తుతం మూడు మాత్రమే పనిచేస్తుండటంతో ఈ వ్యవస్థ పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది. మన సైన్యం, క్షిపణి మార్గదర్శకత్వం, ఖచ్చితమైన దాడుల సామర్థ్యాన్ని ఇవి ప్రభావితం చేస్తాయి.

కార్గిల్ యుద్ధం తర్వాత సొంత నావిగేషన్ ఆలోచన:

1999 కార్గిల్ యుద్ధం సమయంలో, అమెరికా భారతదేశానికి ఖచ్చితమైన GPS సమాచారాన్ని అందించడానికి నిరాకరించింది. ఆ సమయంలో ఎత్తైన కొండలకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి యూఎస్ ఒప్పుకోలేదు. దీంతో భారత సైన్యం పాక్ సైనికులపై ఖచ్చితమైన దాడులు చేయడంతో అవాంతరాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత భారత్ సొంత వ్యవస్థ అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది.

2013 మరియు 2018 మధ్య, ఇస్రో IRNSS (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) ఉపగ్రహాలను ప్రయోగించింది, తరువాత వీటిని NavIC అని పేరు మార్చారు. NavIC భారతదేశంతో పాటు దాని 1,500-కి.మీ చుట్టుపక్కల ప్రాంతంలో పొజిషనింగ్, నావిగేషన్ , టైమింగ్ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం యూఎస్‌కు జీపీఎస్, చైనాకు బీడౌ, యూరప్‌కు గెలీలియో, రష్యాకు గ్లోనాస్ ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి.

ఇస్రో మొత్తం 09 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో 8 శాటిలైట్లలో అంతరిక్షంలోకి చేరాయి. అయితే, వీటిలో 05 శాటిలైట్స్ (IRNSS-1A, 1C, 1D, 1E, 1G) లలో 03 శాటిలైట్‌లలో ‘‘అటామిక్ గడియారం’’ వైఫల్యాన్ని ఎదుర్కొన్నాయి. అణు గడియారాలు ఈ ఉపగ్రహాల్లో కీలకంగా ఉంటాయి. ఇవి ఖచ్చితమైన సమయాన్ని అందిస్తాయి. ఒక సారి ఇవి విఫలమైతే శాటిలైట్ పనికిరాకుండా పోతుంది.

ఇప్పుడు కేవలం మూడు ఉపగ్రహాలు (IRNSS-1B, 1F, 1I) మాత్రమే మిగిలి ఉన్నాయి. IRNSS-1B వయస్సు 11 సంవత్సరాలు. IRNSS-1F యొక్క చివరి అణు గడియారం కూడా మార్చి 13, 2026న విఫలమైంది. ఈ ఉపగ్రహం ఇప్పుడు నావిగేషన్‌ను కాకుండా సందేశ సేవలను మాత్రమే అందిస్తుందని ఇస్రో పేర్కొంది. దీని అర్థం రెండు ఉపగ్రహాలు మాత్రమే ఇప్పటికీ పనిచేస్తున్నాయి.

సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ కూడా విఫలం:

ఫస్ట్ జనరేషన్ శాటిలైట్స్‌లో జరిగిన తప్పులను విశ్లేషించుకుని ఇస్రో సెకండ్ జనరేషన్ శాటిలైట్స్‌ను ప్రయోగించింది. NVS-01 మే 2023 లో ప్రయోగించబడింది మరియు బాగా పనిచేస్తోంది. అయితే, NVS-02 జనవరి 2025 లో ప్రయోగించబడింది, ఇది అనుకున్న కక్ష్యలో కాకుండా తప్పుడు కక్ష్యలో చిక్కుకుంది. దాని ఇంజన్లను మండించడంతో విఫలమైన తర్వాత, అది నావిగేషన్‌కు అవసరమయ్యే సేవల్ని అందించలేకపోయింది. ఇస్రోకు మొత్తం ఐదు NVS ఉపగ్రహాలు అవసరం, కానీ ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మిగిలిన ఉపగ్రహాల ప్రయోగం ఆలస్యం అవుతోంది. 2025 లో, మిగిలిన ఉపగ్రహాలను 2026 నాటికి ప్రయోగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ ఇంకా ఎటువంటి సంకేతం లేదు.

అమెరికా, చైనాలకు దూరంగా భారత్:

అమెరికా జీపీఎస్ వ్యవస్థకు మొత్తం 30 ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే, వీటిలో 24 మాత్రమే అవసరం. చైనాకు చెందిన బీడౌకు 35 శాటిలైట్స్ ఉన్నాయి. అయితే, కేవలం 4 శాటిలైట్స్‌పై పనిచేయాల్సిన భారత నావిక్, ప్రస్తుతం మూడు మాత్రమే వర్కింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితి భారత రక్షణకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. యుద్ధ సమయాల్లో విదేశీ జీపీఎస్ వ్యవస్థలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ప్రమాదాలు ఏంటి.?

సైనిక నావిగేషన్, మిస్సైల్ మార్గదర్శకత్వం ప్రభావితమవుతాయి. శత్రుదేశాలపై ఖచ్చితమైన దాడులు సాధ్యం కాదు. ఓడలు, విమానాల స్థానాలు తప్పుగా మారొచ్చు. నావిక్ పూర్తిగా విఫలమైతే, భారత్ విదేశీ వ్యవస్థలపై ఆధారపడాల్సి వస్తుంది.

Exit mobile version