Site icon NTV Telugu

అఖిలేష్‌ యాదవ్‌కు బిగ్ షాక్‌… బీజేపీలో చేరిన ములాయం కోడలు

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.. ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణ యాదవ్‌.. భాయతీయ జనతా పార్టీలో చేరింది. కొన్నాళ్లుగా బీజేపీతో టచ్‌లో ఉన్న అపర్ణ.. ఎన్నికల సమయంలో పార్టీ మారారు. కాగా, ఎస్పీ అధినేతగా అఖిలేష్‌ యాదవ్‌ ఎంపికైన తర్వాత తిరుగుబాటు చేశారు అపర్ణ యాదవ్‌.. కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉన్న ఆమె.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో బీజేపీలో చేరి ఎస్పీకి షాక్‌ ఇచ్చారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలకు ప్రభావితం అయినట్టు తెలిపారు. ఇక, తనకు అవకాశం ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తాను దేశానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చాను.. అందుకే బీజేపీలో చేరానన్నారు.

Read Also: మళ్లీ మొదటికి పీఆర్సీ పంచాయితీ.. ఇక తేల్చేసేపనిలో ఉద్యోగ సంఘాలు..!

అయితే, అపర్ణా యాదవ్ ములాయం సింగ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరారు. అపర్ణా యాదవ్ 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఆమె 33,796 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో పరాజయం పాలయ్యారు. అపర్ణా యాదవ్ తర్వాత ములాయం సింగ్ యాదవ్ బావమరిది ప్రమోద్ గుప్తా కూడా లక్నోలో బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కాగా, వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందిన ముగ్గురు మంత్రులు ఇటీవల బీజేపీని వీడి సమాజవాది పార్టీలో చేరడంతో అధికార పార్టీ ఖంగుతింది.. అపర్ణ యాదవ్ చేరికతో బీజేపీ నేతలకు పెద్ద ఊరట దక్కినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. “బిఅవేర్” అనే స్వఛ్చంధ సేవా సంస్థ ద్వారా మహిళ సమస్యలపై పోరాడుతున్న అపర్ణ యాదవ్. లక్నో లో “గోవుల” సంరక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు..

Exit mobile version