MOTN Survey: భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. భారతదేశం ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ ప్రధానమంత్రి ఎవరు..? అనే అంశంపై ఇండియా టుడే–సీ ఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN)’ సర్వే సంచలన ఫలితాలను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే దేశంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంతో పాటు, ఆల్ టైమ్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అనే ప్రశ్నను కూడా ప్రజల ముందుంచింది ఈ సర్వే.
అత్యుత్తమ ప్రధానమంత్రి ఎవరు..?
ఈ సర్వే ఫలితాల ప్రకారం, 50 శాతం మంది నరేంద్ర మోడీనే భారతదేశం చూసిన అత్యుత్తమ ప్రధానమంత్రి అని అభిప్రాయపడ్డారు. 12 శాతం మంది ఇందిరా గాంధీని ఉత్తమ ప్రధాని అని పేర్కొన్నారు. అదే శాతంలో అటల్ బిహారీ వాజ్‌పేయికి కూడా మద్దతు లభించింది. ఇక, 11 శాతం మంది డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఉత్తమ ప్రధానిగా పేర్కొన్నారు. 6 శాతం మంది జవహర్‌లాల్ నెహ్రూను దేశం చూసిన గొప్ప ప్రధాని అని అభిప్రాయపడ్డారు.
తదుపరి ప్రధాని ఎవరంటే..?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని పదవికి ఎవరు తొలి ఎంపికగా ఉంటారు అనే ప్రశ్నకు కూడా 55 శాతం మంది నరేంద్ర మోడీ అని సమాధానమిచ్చారు.. ఆ తర్వాత 27 శాతం మంది రాహుల్ గాంధీని ఎంపిక చేశారు. అయితే, ఆగస్టు 2025లో నిర్వహించిన మునుపటి సర్వేతో పోల్చితే, మోడీకి మద్దతు మరింత పెరిగినట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
మోడీ పనితీరుపై ప్రజల అభిప్రాయం
నరేంద్ర మోడీ ప్రధానిగా పనితీరు పట్ల 57 శాతం మంది చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. 16 శాతం మంది సగటు పనితీరు అని, 24 శాతం మంది అసంతృప్తిగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. ఇక, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై 52 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 24 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఈరోజే ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయంటే..? ఎన్డీఏ – 352 సీట్లు, ఇండియా కూటమికి – 182 సీట్లు, ఇతరులు – 9 సీట్లు వస్తాయని.. ఓట్ల శాతం పరంగా చూస్తే.. ఎన్డీఏ – 47 శాతం, ఇండియా కూటిమికి – 39 శాతం, ఇతరులు – 14 శాతం ఓట్లు సాధించనున్నారు..
సర్వే వివరాలు
ఈ సర్వేను డిసెంబర్ 8, 2025 నుంచి జనవరి 21, 2026 వరకు నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని వయసులు, కులాలు, మతాలు, జెండర్‌లకు చెందిన 36,265 మంది ఇందులో పాల్గొన్నారు. అయితే దాదాపు ±5 శాతం లోపం ఉండే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సర్వే ఫలితాలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజల మద్దతు ఇంకా బలంగా ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
