Monkey Pox Second Case Confirmed In Kerala Kannur District: ఓవైపు కరోనా కేసులు కలవరపెడుతుంటే, మరోవైపు మంకీపాక్స్ ఆందోళనకు గురి చేస్తోంది. భారత్‌లో తాజాగా రెండో కేసు నమోదైంది. మొదటి కేసు కేరళలో నమోదవ్వగా.. రెండో కేసు ఆ రాష్ట్రంలోనే వెలుగు చూసింది. ఈ నెల 13వ తేదీన దుబాయ్ నుంచి వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలినట్టు కేరళ రాష్ట్ర వైద్య శాఖ ధృవీకరించింది. ‘‘కన్నూర్ జిల్లాకు చెందిన ఆ ఈనెల 13న దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఆయనలో లక్షణాలు కనిపించడంతో, నమూనాలను ఎన్ఐవీ పుణెకు పంపించాం. మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి సారించాం’’ అని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. కాగా.. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మొదటిసారి మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించారు. ఇప్పుడు రెండో కేసు నమోదైన నేపథ్యంలో.. కేంద్రం హై అలర్ట్ అయ్యింది.
ఇంతకీ మంకీపాక్స్ వైరస్ ఏంటి?
ఇదొక వైరల్ వ్యాధి. స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందిన ఈ వ్యాధి.. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. ఈ వైరస్‌ను మొదటిసారిగా 1958లో కోతుల్లో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో ఈ వైరస్ మనుషులకు వ్యాపించినట్టు తేలింది. తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతిదగ్గర ఉండటం వల్ల ఇతరులకి మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉంది. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి 6 నుంచి 13 రోజులు లేదా 5 నుంచి 21 రోజుల సమయం పడుతుంది. జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ముఖం, చేతులు, కాళ్లపై దుద్దర్లు ఏర్పడుతాయి.