మే నెల అంటేనే భానుడు ప్రతాపానికి పెట్టింది పేరు.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి.. ఈ సమయంలో.. వడదెబ్బతో మృతిచెందేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.. కానీ, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది..
ఎండలు దంచికొట్టే మే నెలలో వర్షాలు కురిసాయి.. అది ఎంతలా అంటే.. ఏకంగా 121 ఏళ్ల రికార్డుకు చేరువయ్యేలా.. ఈ ఏడాది మే నెలలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ (ఐంఎడీ) తన నివేదికలో పేర్కొంది.. వెంట వెంటనే వచ్చిన రెండు తుఫాన్లు వర్షపాతాన్ని అమాంతం పెంచేశాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం కూడా చాలా ఏళ్ల తర్వాత జరిగిన పరిణామమే.. మే నెలలో నమోదైన సగటు అత్యధిక ఉష్ణోగ్రత 34.18 డిగ్రీల సెల్సియస్.. 1901 తర్వాత మే నెలలో నమోదైన నాలుగో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం మరో విశేషంగా చెప్పాలి. మేలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత 1917 లో 32.68 డిగ్రీల సెల్సియస్. 1977లో 33.84 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం 107.9 మిల్లీమీటర్లు నమోదైందని, ఇది 62 మిమీల లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్పిఎ) కన్నా 74 శాతం ఎక్కువని పేర్కొంది ఐఎండీ.. మే నెలలో నమోదైన వర్షపాతం 1901 నుండి రెండవ అత్యధికం.. ఎందుకేంటే.. 1990 సంవత్సరంలో (110.7 మిమీ) అత్యధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో అరేబియా సముద్రం ఒకటి, బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడడం కూడా దీనికి కారణంగా చెబుతోంది.. ఈ తుఫాన్ల ప్రభావంతో తీర ప్రాంతాల్లో కాకుండా.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసాయి..