అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మరోసారి భారత్ పర్యటనకు రానున్నారు. ఈ శనివారం నుంచి దేశంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 17 నుంచి 22 వరకు భారత్, ఉజ్బెకిస్థాన్‌లో పర్యటన ఉండనుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో రూబియో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఇంధన సహకారం, వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలు చర్చకు రానున్నాయి.
పర్యటనలో భాగంగా ఆయన భారత్‌లోని ముంబై, గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను సందర్శించనున్నారు. వాణిజ్య సుంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రూబియో పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా విదేశాంగ శాఖ మంగళవారం రూబియో పర్యటన వివరాలను వెల్లడించింది. భారత్‌లో ఉన్నతాధికారులతో రూబియో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. ఇంధన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపైనా చర్చలు జరపనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఆలస్యం కావడం, సుంకాలపై విభేదాలు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు కొనసాగించడం వంటి అంశాలు ఇరు దేశాల సంబంధాల్లో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో రూబియో పర్యటనలో ఇంధన సహకారానికి ప్రాధాన్యం లభించనుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100 శాతం వరకు సుంకాలు విధించేలా ప్రతిపాదించిన చట్టంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ రష్యా నుంచి ఇంధన దిగుమతులను కొంతకాలం తగ్గించినప్పటికీ.. అనంతరం ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో కొనుగోళ్లు మళ్లీ పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పులు కూడా ఈ పరిణామాలకు కారణమయ్యాయి.
గుజరాత్‌లోని జామ్‌నగర్ భారత ఇంధన రంగంలో కీలక కేంద్రం. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన భారీ చమురు శుద్ధి సముదాయం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఒకే ప్రాంగణంలోని చమురు శుద్ధి కేంద్రంగా గుర్తింపు పొందింది. రోజుకు సుమారు 14 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్‌విల్లేలో కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను ట్రంప్ మార్చిలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రూబియో జామ్‌నగర్ పర్యటన ఇరు దేశాల ఇంధన, వాణిజ్య సంబంధాల పరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్‌కు వచ్చే ముందు రూబియో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో జరిగే ‘C5+1’ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. ఇందులో అమెరికాతో పాటు మధ్య ఆసియాకు చెందిన కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో ప్రాంతీయ సహకారం, ఆర్థిక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలపై చర్చించనున్నారు. ఆయా దేశాల ఉన్నతాధికారులతో రూబియో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారు.

