Marathi TV actress Kalyani Kurale Jadhav killed in road accident: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ మరాఠీ టీవీ నటి దుర్మరణం చెందింది. ఒక డ్రైవర్ చేసిన చిన్న తప్పు వల్ల.. ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ నటి పేరు కళ్యాణి కురాలే జాదవ్. కొల్హాపూర్ జిల్లాలో సాంగ్లీ-కొల్హాపూర్ హైవేపై శనివారం రాత్రి ఈ నటి తన ఇంటికి వెళ్తోంది. హలోండి కూడలి సమీపంలో ఒక కాంక్రీట్ మిశ్చర్ ట్రాక్టర్ ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో కళ్యాణి తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆలస్యమైంది. ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గాయాలు తీవ్రంగా అవ్వడం, రక్తస్రావం ఎక్కువ కావడంతో.. ఆమె ఆసుపత్రికి రావడానికి ముందు ప్రాణాలు విడిచిందని డాక్టర్లు పేర్కొన్నారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, బుల్లితెర నటి చావుకి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ సాగర్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘హలోండిలో కళ్యాణి ఇటీవల ఒక రెస్టారెంట్ ప్రారంభించారు. శనివారం రాత్రి రెస్టారెంట్ మూసి వేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో.. ఆమె ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఆ ట్రాక్టర్ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశాం’’ అని చెప్పాడు. కాగా.. కళ్యాణి తుజ్హత్ జీవ్ రంగా, దఖంచ రాజా జ్యోతిబా వంటి మరాఠీ టీవీ సీరియల్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించింది. ఈమె కొల్హాపూర్ నగరంలోని రాజారంపురి ప్రాంతంలో నివాసముంటోంది. ఓవైపు కెరీర్, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎదుగుతున్న క్రమంలోనే.. కళ్యాణి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో మరాఠీ బుల్లితెర ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది.