కొన్ని కథలు మనల్ని ఆపి, రెండుసార్లు చదివేలా చేస్తాయి, షాజాపూర్ వివాహ కేసు అలాంటి వాటిలో ఒకటి. మధ్యప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి, తన పెళ్ళి జరిగిన దాదాపు 25 రోజుల తర్వాత, తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి ట్రాన్స్‌జెండర్ అని తెలుసుకున్నట్లు ఆరోపించాడు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడికి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. అమ్మాయికి లవ్ ఎఫైర్ అనుకుంటే పొరపాటే.. తను పెళ్లి చేసుకున్న వ్యక్తి ట్రాన్స్ జెండర్ కావడంతో యువకుడు ఆశ్చర్యపోయాడు. తనకు అమ్మాయి అని చెప్పి ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో వివాహం జరిపించి మోసం చేశారంటూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 32 ఏళ్ల యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
తనకు తెలియకుండా పెళ్లి చేసిన అత్తామామలతో పాటు మొత్తం ఐదుగురిపై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. షాజపూర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్న బాధిత యువకుడి ప్రకారం.. జూన్ 29న హిందూ సంప్రదాయాల ప్రకారం ఓ ఆలయంలో తన వివాహం జరిగింది. పెళ్లి కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేశానని, వధువు కుటుంబానికి రూ.1 లక్ష నగదుగా ఇచ్చానని అతడు పోలీసులకు తెలిపాడు.
అయితే వివాహం అనంతరం భార్య, ఆమె కుటుంబ సభ్యులు వివిధ కారణాలు చెబుతూ శోభనాన్ని పదేపదే వాయిదా వేయడంతో తనకు అనుమానం వచ్చిందని యువకుడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఓ రోజు తన భార్య గడ్డం గీసుకోవడాన్ని గమనించానని, దీంతో ఆమె ట్రాన్స్‌జెండర్ అయి ఉండొచ్చనే అనుమానం మరింత బలపడిందని చెప్పాడు. ఈ విషయంపై భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని బాధితుడు ఆరోపించాడు. తనకు వాస్తవాన్ని దాచిపెట్టి వివాహం జరిపించారని, తనను మోసం చేశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే ఫిర్యాదులో చేసిన ఆరోపణలు నిజమా కాదా అన్నది వైద్య పరీక్షల అనంతరం మాత్రమే నిర్ధారించగలమని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల్లో ఆరోపణలు నిర్ధారణ అయితే, బాధితుడి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై చీటింగ్ తదితర నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోపణలు నిర్ధారణ అయ్యే వరకు సంబంధిత వ్యక్తి లింగ గుర్తింపు లేదా వైద్య పరిస్థితిపై తుది నిర్ణయం తీసుకోలేమని అధికారులు స్పష్టం చేశారు.

