Site icon NTV Telugu

Porn Addiction: పిల్లల్లో పోర్న్ అడిక్షన్‌పై మద్రాస్ హైకోర్ట్ ఆందోళన.. కీలక వ్యాఖ్యలు..

Madras High Court

Madras High Court

Porn Addiction: ఈ తరం పిల్లల్లో పోర్న్ వ్యసనంపై మద్రాస్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలలో సులభంగా పోర్న్ ఫోటోలు, వీడియోలను చూసే అలవాటు ఈ తరం టీనేజర్లలో పెరుగున్నట్లు మద్రాస్ హైకోర్టు గుర్తించింది. టీనేజ్ యువతకు మార్గనిర్దేశం చేయాలని కోర్టు సమాజాన్ని కోరింది.

జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఈ విషయంలో జనరేషన్-జెడ్ పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తి చూపారు. నిర్మాణాత్మక విధానాన్ని ప్రతిపాదించారు. వీటిని ఖండించడం కంటే ఈ వ్యసనాన్ని అధిగమించడానికి వారికి మార్గదర్శకత్వం చేయాలని చేయాలని కోరారు. ఈ తరం పిల్లలు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారని, వారిని తిట్టడం, శిక్షించే బదులు సమాజం వారికి సరైన సలహాలు ఇవ్వాలని, వారు ఈ వ్యసనాన్ని వదిలించుకోవడానికి సరైన విద్యను అందించాలని, ఇది పాఠశాల నుంచే ప్రారంభం కావాలని కోర్టు వ్యాఖ్యానించింది. పోర్న్ ముఖ్యంగా ప్రాథమిక సహజమైన సెక్స్‌ని ప్రేరేపిస్తోందని, దీనికి సులభంగా బానిస కావడం చాలా సులభం అని చెప్పింది.

Read Also: Tantra: వకీల్ సాబ్ బ్యూటీ కోసం రంగంలోకి మంగళవారం బ్యూటీ దిగిందిగా..

యుక్త వయసులో అశ్లీలతకు గురికావడంపై ఇటీవల పరిశోధనల్ని కోర్టు హైలెట్చేసింది. పరిశోధన ప్రకారం.. 10 మంది అబ్బాయిల్లో 9 మంది 18 ఏళ్లు నిండకముందే పోర్న్ చూస్తున్నారని, 10 మంది బాలికల్లో 6 మంది బాలికలు 18 ఏళ్లు రాకముందే ఇదే విధంగా చేస్తున్నారని పేర్కొంది. బాలురు తమ 12 ఏటనే పోర్నోగ్రఫీని చూస్తున్నారని, 12-17 ఏళ్ల మధ్య పోర్న్ అడిక్షన్ పెరుగుతోందని చెప్పింది. 71 శాతం టీనేజర్లు వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను వారి తల్లిదండ్రుల నుంచి దాచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కోర్టు పేర్కొంది.

అశ్లీల చిత్రాలను వినియోగించే చర్య వ్యక్తుల మానసిక మరియు శారీరక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో పిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉన్నారని ఆరోపించిన వ్యక్తిపై అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు సమీక్షిస్తోంది. విచారణ సమయంలో, ఆ వ్యక్తి అశ్లీల చిత్రాలను చూసే అలవాటును గుర్తించింది. ఈ అలవాటును అధిగమించాలనే కోరికను సదరు వ్యక్తి వ్యక్తం చేశాడు. ఈ వ్యసనాన్ని ఎదుర్కొనేందుకు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోర్టు సిఫారసు చేసింది.

Exit mobile version