NTV Telugu Site icon

Waqf Bill: “వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌గా జగదాంబికా పాల్ నియామకం..

Jagadambika Pal

Jagadambika Pal

Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలని’ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగంపై దాడిగా, మతస్వేచ్ఛని హరిస్తున్నాయంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ బిల్లుపై ఆందోళన చేశాయి. దీంతో ఈ బిల్లుని చర్చించేందుకు ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని నియమించింది. 21 మంది అధికార, ప్రతిపక్షకు చెందిన లోక్‌సభ ఎంపీలను, 10 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తంగా 31 మందితో జేపీసీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌ని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు.

Read Also: Allahabad HC: ‘‘యూపీ మతమార్పిడి నిరోధక చట్టం’’ భారత లౌకిక స్పూర్తికి నిదర్శనం..

కేంద్రం రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేయడంతో పాటు వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణల తొలగింపుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం ఈ చట్టం యొక్క లక్ష్యం. 1995 వక్ఫ్ చట్టంలోని 44 సెక్షన్‌ని సవరించాలని చట్టం ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని బిల్లు ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు మరియు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా నిర్దేశించింది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలోని మరో వివాదాస్పద అంశం.

ఇదిలా ఉంటే, లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇది కఠినమైన చట్టమని, మతస్వేచ్ఛ, సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించింది. ఈ బిల్లును బాగా ఆలోచించి రాజకీయాల్లో భాగంగా ప్రవేశపెట్టారని విమర్శించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘ ఈ బిల్లు ఏ మత సంస్థ స్వేచ్ఛని హరించదు. ఎవరి హక్కుల్ని హరించదు. ఎవరైతే ఇప్పటి వరకు హక్కులు పొందలేదో వారికి హక్కుల్ని కల్పిస్తుంది’’అని అన్నారు. ఈ రోజు తీసుకువచ్చిన ఈ బిల్లును కాంగ్రెస్ హయాంతో సచార్ కమిటీ నివేదిక ఆధారంగా రూపొందించామని అన్నారు.

Show comments