NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటే ఏమిటి..? ఎన్నికల ముందే ఎందుకు..

Elections

Elections

Lok Sabha Elections 2024: కేంద్రం ఎన్నికల సంఘం లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి( మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ MCC) అమలులోకి వచ్చింది. ఈ నియమావళి ఎన్నిలక ఫలితాలు ప్రకటించే వరకు ఉంటుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎంసీసీకి కట్టుబడి ఉంటాలి. ఎవరైనా వీటిని ఉల్లంఘించినట్లైతే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవచ్చు. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఎలాంటి ప్రజాకర్షక పథకాలను ప్రకటించకుండా ఆంక్షలు విధించింది.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి..?

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారాన్ని నియంత్రించేందుకు ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలే ప్రవర్తనా నియమావళి. ఓటర్లను ప్రభావితం చేయకుండా నిరోధించడం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ దీని లక్ష్యం. ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని కుల, మతాల, ఇతర అంశాల ఆధారంగా ఓట్లను అడగడం, ప్రజల మధ్య చిచ్చుపెట్టే చర్యల్ని ఎంసీసీ అనుమతించదు. ఒకరిపై ఒకరు విద్వేష వ్యాఖ్యలు చేయడాన్ని అడ్డుకుంటుంది.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది..?

* ప్రభుత్వం కొత్త పనులు, ప్రాజెక్టులను ప్రారంభించడం లేదా శంకుస్థాపన చేయడాన్ని నిషేధిస్తుంది.
* రోడ్ల నిర్మాణం లేదా తాగు నీరు సౌకర్యాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి అధికారులు వాగ్ధానాలు చేయలేరు.
* ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంస్థల్లో తాత్కాలిక నియామకాలు నిషేధించబడుతాయి.
* మంత్రులు లేదా ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులు ఎలాంటి నిధులను, చెల్లింపులను మంజూరు చేయలేరు.
* ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వనరులైన రవాణా, యంత్రాలు, భద్రతా సిబ్బందిని ఉపయోగించడం నిషేధించబడుతుంది.
* రెస్ట్ హౌజులు, డాక్ బంగ్లాలు లేదా ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.
* మీడియా పక్షపాత కవరేజీని, అధికార పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేయడాన్ని నిషేధిస్తుంది.
* ఓటర్లను ప్రభావితం చేయడానికి కుల మరియు మతపరమైన భావాలను ఉపయోగించుకోవడం, పుకార్లు వ్యాప్తి చేయడం మరియు ఓటర్లను లంచం ఇవ్వడానికి లేదా భయపెట్టడానికి ప్రయత్నించడం వంటివి అనుమతించబడవు.

ఎంసీసీ చరిత్ర:
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మొదటిసారిగా కేరళలో 1960 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టారు. ఇది విజయం సాధించడంతో 1962 లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. 1991 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తుండటంతో, మరింత కఠినంగా అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.