Chhattisgarh HC: భారతదేశంలో ఇటీవల కాలంలో ‘లివ్-ఇన్ రిలేషన్’ ధోరణి పెరుగుతోంది. అదే సమయంలో ఈ సహజీవనం అనే పాశ్చాత్య సంస్కృతి వివాదాలకు కారణమవుతోంది. ఇలాంటి సంబంధాల్లో హత్యలు జరిగిన ఉదంతాలు కూడా ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్ అనేది భారతీయ సిద్ధాంతాల సాధారణ అంచనాలకు విరుద్ధమైన ‘‘దిగుమతి’’ అంశం అని, భారతీయ సంస్కృతిలో ఇది ఇప్పటికీ ‘‘కళంకం’’గా పరిగణించబడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది.
లివ్-ఇన్ రిలేషన్ నుంచి జన్మించిన బిడ్డ కస్టడీ కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని జస్టిస్ గౌతమ్ భాదురి మరియు జస్టిస్ సంజయ్ ఎస్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తోసిపుచ్చింది. వివాహం కంటే ఇలాంటి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతోందని, ఎందుకంటే జంట మధ్య ఇలాంటి సంబంధాలు విఫలమైనప్పుడు సౌకర్యవంతంగా తప్పించుకోవడానికి వీలు కలిగిస్తున్నాయని చెప్పింది. వివాహం అనేది ఒక వ్యక్తి అందించే భద్రత, సామాజిక అంగీకారం, పురోగతి, స్థిరత్వం వంటివి ఎప్పటికీ లివ్ ఇన్ రిలేషన్స్ ఇవ్వలేవని కోర్టు పేర్కొంది. పాశ్చాత్య దేశాల సాంస్కృతిక ప్రభావం కారణంగా గతంలో మాదిరిగా వివాహ వ్యవస్థను ప్రజలు నియంత్రించలేదని, సమాజాన్ని నిశితంగా గమనిస్తే ఇది తెలుస్తుందని, ఈ గణనీయమైన మార్పు, వైవాహిక విధుల పట్ల ఉదాసీనతకు ఈ లివ్ ఇన్ రిలేషన్స్ అనే భావన దారి తీస్తోందని హైకోర్టు పేర్కొంది.
Read Also: Supreme Court: కేజ్రీవాల్‌కు స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్‌పై 10న ఉత్తర్వులు!
ఛత్తీస్‌గఢ్ లోని దంతెవాడకు చెందిన అబ్దుల్ హమీద్ సిద్ధిఖీ అనే పిటిషనర్, కవిత గుప్తాతో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండేవారు. వీరికి పుట్టిన బిడ్డకు కస్టడీ ఇవ్వాలని సిద్దిఖీ కోర్టుని కోరాడు. ఇద్దరూ మూడేళ్ల పాటు రిలేషన్‌షిప్ ఉన్నారు. మతం మారకుండా 2021లో వివాహం చేసుకున్నారు. 2023లో దంతెవాడ కుటుంబ న్యాయస్థానం అతని అభ్యర్థనను తిరస్కరించగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 2023లో కవిత తన పిల్లలతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిందని, అప్పటి నుంచి పిల్లల కస్టడీ తనకు ఇవ్వాలని కోరుతున్నట్లు పిటిషనర్ పేర్కొన్నాడు.
ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం ఇరు పక్షాలు వివాహం చేసుకున్నాయని, అతను మహమ్మదీయ చట్టం ప్రకారం నిర్వహించబడుతున్నందున, అతను రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతించబడ్డాడని , కవితా గుప్తాతో అతని వివాహం చట్టబద్ధమైనదని సిద్ధిఖీ న్యాయవాది చెప్పారు. వివాహం నుంచి పుట్టిన బిడ్డకు అతను సహజ సంరక్షకుడిగా ఉంటాడని, బిడ్డ కస్టడీకి అర్హుడని వాదించారు. అయితే, సిద్దికీ మొదటి భార్య సజీవంగా ఉన్నందున రెండో వివాహం అనుమతించబడదని గుప్తా తరుపున లాయర్ వాదించారు. ఇలాంటి సంబంధం నుంచి పుట్టిన బిడ్డ కస్టడీని అతను కోరలేడని వాదించారు.