NTV Telugu Site icon

President Draupadi Murmu: ముర్ముకు అభినందనల వెల్లువ.. చైనా, శ్రీలంక అధినేతల కీలక సందేశం

President Draupadi Murmu

President Draupadi Murmu

President Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని, ఉపరాష్ట్రపతితో పాటు విదేశీ ప్రముఖులు ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కళాకారులు సైతం వినూత్నంగా నూతన రాష్ట్రపతికి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి పదవిని ద్రౌపదీ ముర్ము అలంకరించడం దేశచరిత్రలో సువర్ణఅధ్యాయంగా నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ముర్ము ప్రమాణస్వీకారం చేయడాన్ని దేశమంతా గర్వంతో తిలకించిందన్నారు. ఆమె పదవీ కాలం ఫలప్రదంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పదవిని ద్రౌపదీ ముర్ము అలంకరించడం దేశచరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ముర్ము అత్యున్నత పదవిని స్వీకరించడం దేశంలోని బలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ.. ముర్ముచే ప్రమాణస్వీకారం చేయించారు. తద్వారా ఈ పదవి చేపట్టిన తొలి ఆదివాసీగా ద్రౌపది ముర్ము ఘనతకెక్కారు. అంతేగాక, అతిపిన్న వయసులో రాష్ట్రపతి పదవిని చేపట్టిన వ్యక్తిగా ముర్ము రికార్డు సాధించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత జన్మించి రాష్ట్రపతి పదవిలోకి వచ్చిన తొలి వ్యక్తి ముర్మునే కావడం విశేషం.

ముర్ముకు విదేశీ నేతలు సైతం శుభాకాంక్షలు చెప్పారు. చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ ముర్ముతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సందేశం పంపారు. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు తాను అత్యంత ప్రాధాన్యం ఇస్తానని జిన్​పింగ్ చెప్పారు. ఇరుదేశాల సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు ముర్ముతో కలిసి పనిచేస్తామన్నారు.

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన భారత రాష్ట్రపతి పదవికి ఎన్నికవడం అనేది.. ఆమె రాజకీయ చతురతపై ప్రభుత్వం, ఆమెపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. భారత్‌- శ్రీలంక మధ్య ఎన్నో ఏళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అనేక రంగాల్లో పరస్పర సహకారం ఉందని ఆయన గుర్తు చేశారు.

CBI : రాజ్యసభ ఎంపీ అవుతారా..? గవర్నర్‌గా వెళ్తారా? వంద కోట్లు ఉంటే చాలు..! అసలు విషయం తెలిస్తే షాకే..!

దేశంలోని కళాకారులు సైతం నూతన రాష్ట్రపతి ముర్ముకు తమదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.. ముర్ముకు మద్దతుగా పూరి తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఈశ్వర్ రావు అనే ఆర్టిస్ట్.. గాజు సీసాలో ముర్ము మినియేచర్ ఫొటో ఫ్రేమ్‌ను తీర్చిదిద్దారు. పొడవాటి పుల్లల సాయంతో సీసా లోపలే ఫ్రేమ్ను రూపొందించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఆర్టిస్ట్ జగ్‌జోత్ సింగ్ రూబల్ ఏడు అడుగుల ముర్ము చిత్రాన్ని వేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Show comments