Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..

  • CJP నిరసనలకు వ్యతిరేకంగా ‘లాల్ హిట్ జనతా పార్టీ’ పేరుతో కొత్త గ్రూప్
  • ఢిల్లీలోని మాలవ్య స్మృతి భవన్‌లో తొలి సభ్యత్వ సమావేశం
  • CJP, కాంగ్రెస్, నిరసనకారులపై అధినేత అయాన్ భట్నాగర్ విమర్శలు
Lal Hit Janata Party

Lal Hit Janata Party

Lal Hit Janata Party: నీట్ పేపర్ లీక్‌పై జంతర్ మంతర్ నిరసనల తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకువచ్చిన ఈ సీజేపీ ఇప్పుడు సీఈసీని టార్గెట్ చేస్తోంది. ఇదిలా, సీజేపీకి వ్యతిరేకంగా ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ఏర్పాటైంది.

ఆదివారం ఢిల్లీలోని మాలవ్య స్మృతి భవన్‌లో ఈ గ్రూపు తొలి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ పార్టీ అధినేత అయాన్ భట్నాగర్ మాట్లాడుతూ.. సీజేపీ, కాంగ్రెస్, నిరసనకారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆందోళన కారణంగా ప్రజల్లో రాజ్యాంగ సంస్థలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటోందని, వ్యాపారులకు నష్టం కలుగుతోందని వారు ఆరోపించారు. తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజల్ని సమీకరించడమే తమ లక్ష్యమని భట్నాగర్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిస్తే ఎంత మంది ప్రజలు తరలివస్తారో ఆలోచించుకోవాలని సీజేపీకి వార్నింగ్ ఇచ్చారు.

దసరా, దీపావళి వరకు వ్యాపారులకు కీలకమైన సీజన్ అని, ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఆటంకం కలిగించడాన్ని సహించేది లేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము ఈ పార్టీని పెట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి సీజేపీకి మద్దతు లభిస్తోందని, బీజేపీని ప్రభుత్వం నుంచి తొలగించేందుకు ఈ గ్రూపులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. పోలీసులపై నిరసనకారుల దురుసు ప్రవర్తనను సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దసరా రోజు నుంచే ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ ముగింపు ప్రారంభమవుతుందని హెచ్చరించారు.