Kulgam Encounter: కుల్గాం ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబాకు చెందిన లతీఫ్ భట్ హతమయ్యాడు. కుల్గాం జిల్లాలోని లారూ ప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన గాలింపు చర్యల సందర్భంగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లతీఫ్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంలో సీఆర్పీఎఫ్ భద్రతా పోస్టుపై నవంబర్ 11న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
లతీఫ్ భట్ ఎవరు.?
లతీఫ్ భట్ కుల్గాం జిల్లాకు చెందిన వ్యక్తి. కళాశాల చదువును మానేసి, ఆ తర్వాత స్థానికంగా కార్పెంటర్ పనిచేశాడు. 2025 నవంబర్‌లో అకస్మాత్తుగా ఆచూకీ లేకుండా పోయాడు. ఆ తర్వాత లష్కరే తోయిబాలో చేరినట్లు తెలిసింది. ఈ ఉగ్ర సంస్థకు రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF), కాశ్మీర్ రివల్యూషనరీ ఆర్మీ (KRA) వంటి ఉగ్ర గ్రూపులు ప్రాక్సీలుగా పనిచేస్తున్నాయి. లతీఫ్ దక్షిణ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
జూలై 2026లో షోషియాన్‌లో జరిగిన భద్రతా ఆపరేషన్ నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో లతీఫ్‌కు జాకీర్ అహ్మద్ ఘనీతో సంబంధాలు ఉన్నాయి. ఈ ఘనీని జూలై 2026లో భద్రతా బలగాలు హతమార్చాయి.
6 రోజులుగా గాలింపు, 600 అనుమానితుల విచారణ..
నవంబర్ 11న కుల్గాం సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాలను దిగ్బంధించి, ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. అనుమానితుల కదలికల్ని పసిగట్టడానికి, ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి, ఆయుధ నిల్వల్ని గుర్తించడానికి డ్రోన్లు, జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో గాలింపు చేపట్టారు. 600 మందికి పైగా అనుమానితుల్ని విచారించారు.

