UDF Kerala Government: కేరళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రాష్ట్ర నూతన (13వ) ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.డి.సతీశన్ నేడు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు భారీ ప్రజాసమూహం, ప్రముఖ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. సతీశన్‌తో పాటు మరో 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.
సమతుల్యతతో మంత్రివర్గ కూర్పు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వి.డి.సతీశన్ ఆదివారమే తన కేబినెట్ సహచరుల జాబితాను అధికారికంగా ప్రకటించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ జాబితాను ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. మంత్రివర్గంలో కేరళంలోని అన్ని ప్రాంతాలకు, సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సతీశన్ స్పష్టం చేశారు. ఈ కొత్త మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు సీనియర్ నాయకులకు చోటు దక్కింది. పార్టీ అగ్రనేతలు రమేష్ చెన్నితాల, కె.మురళీధరన్, సన్నీ జోసెఫ్ తదితరులు కేబినెట్‌లో చేరబోతున్నట్లు కాబోయే సీఎం పేర్కొన్నారు.
ఐయూఎంఎల్ (IUML) నుంచి ఐదుగురికి ఛాన్స్
సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి కూడా మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత లభించిందని సమాచారం. ఈ పార్టీ తరఫున ఐదుగురు సీనియర్ నాయకులకు మంత్రి పదవులు కేటాయించినట్లు ఐయూఎంఎల్ అధినేత పనక్కాడ్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పీకే కున్హాలికుట్టి, ఎన్ షమ్సుద్దీన్, కేఎం షాజీ, పీకే బషీర్, వీఈ అబ్దుల్ గఫూర్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారని చెబుతున్నారు.
స్పీకర్‌గా తిరువంచూర్ రాధాకృష్ణన్..
మరోవైపు శాసనసభ స్థానాలకు సంబంధించి కూడా యూడీఎఫ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తిరువంచూర్ రాధాకృష్ణన్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా నామినేట్ చేయాలని నిర్ణయించారు. అలాగే డిప్యూటీ స్పీకర్‌గా షానిమోల్ ఉస్మాన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజాగా జరిగిన కేరళం ఎన్నికల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. నిజానికి ఇది పార్టీ పరంగా అతిపెద్ద విజయాల్లో ఒకటి అని సతీశన్ అభివర్ణించారు. అయితే ఎంతోమంది సమర్థులైన నాయకులు ఉన్నప్పటికీ అందరినీ మంత్రివర్గంలోకి తీసుకోవడం సాధ్యపడలేదని ఆయన నిజాయితీగా అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మా పార్టీలో మంత్రి పదవులకు అర్హులైన, సమర్థులైన నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కొందరికి చోటు కల్పించలేకపోయాం” అని చెప్పారు. సంకీర్ణ పార్టీల మధ్య మంత్రిత్వ శాఖల కేటాయింపునకు సంబంధించిన చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని, కేవలం కొన్ని చిన్న చిన్న విషయాలపై మాత్రమే స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే తుది జాబితాను గవర్నర్‌కు అధికారికంగా సమర్పించనున్నట్లు సతీశన్ వెల్లడించారు. అనంతరం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా మంత్రుల శాఖల వివరాలను వెల్లడిస్తామన్నారు.
