Site icon NTV Telugu

Doctors Handwriting: ఒట్టేసి చెప్తున్నా.. ఇది నిజంగా డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షనే!

Nitin Narayan Handwriting

Nitin Narayan Handwriting

Kerala Doctor Prescription With Super Neat Writing Going Viral On Internet: డాక్టర్లు రాసే రాతలు ఎంత గజిబిజీగా, అర్థరహితంగా ఉంటాయో అందరికీ తెలుసు. ఒక్క ఫార్మాసిస్టులు మినహాయిస్తే.. మరెవ్వరు ఆ రాతని అర్థం చేసుకోలేరు. ఎంతటి ప్రతిభావంతుడైనా సరే.. డాక్టర్ హ్యాండ్‌రైటింగ్‌ ముందు దిగదుడుపే! కనీసం ఒక్క అక్షరమైనా చదువుదామన్నా.. అవి కూడా అర్థం కాని రీతిలో, వంకరటింకరగా ఉంటాయి. కానీ.. కేరళకు చెందిన ఒక డాక్టర్ మాత్రం అలా కాదు. అందరు డాక్టర్లకు భిన్నంగా.. ముత్యం లాంటి అక్షరాలతో చాలా నీటుగా ప్రిస్ర్కిప్షన్స్ రాస్తాడు. పేషెంట్లు కూడా సునాయాసంగా చదివగలిగే రీతిలో అతని హ్యాండ్‌రైటింగ్ ఉంటుంది. అవును, నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం అక్షరాల నిజం. ఆ డాక్టర్ రైటింగ్ చూస్తే.. ఇది నిజంగానే డాక్టర్ రాసిన ప్రిస్ర్కిప్షనా? అంటూ ఆశ్చర్యపోక మానదు.

ఆ డాక్టర్ పేరు నితిన్ నారాయణ్. అతను పాలక్కడ్‌లోని కమ్యునిటీ హెల్త్ సెంటర్‌లో మూడేళ్లుగా పీడియాట్రీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్‌ను బెన్సీ ఎస్‌డీ అనే ఓ నెటిజన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అందులో నాలుగు రకాల మందుల్ని రాశాడు. అవి ఏయే మందులు, ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పైగా.. ఆ వైద్యుడు మొత్తం క్యాపిటల్ లెటర్‌లోనే రాశాడు. ఓ వైద్యుడు ఇంత నీటుగా ప్రిస్క్రిప్షన్ రాయడంతో సంభ్రమాశ్చర్యాలకు గురైన బెన్సీ, వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో అది అనతికాలంలోనే నెట్టింట్లో వైరల్ అయిపోయింది. ఇది ఓ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ అంటే నమ్మశక్యంగా లేదంటూ.. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ డాక్టర్‌పై ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు. నీలాంటి డాక్టర్లుంటే, పేషెంట్లకు ఎంత బాగుంటుందోనని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక తన రైటింగ్‌పై డాక్టర్ నితిన్ నారాయణ్ మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచే తన హ్యాండ్‌రైటింగ్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకున్నానని, కాపీబుక్స్ బాగా రాసేవాడినని అన్నాడు. తన విద్య పూర్తయ్యాక కూడా తన హ్యాండ్‌రైటింగ్ స్టైల్‌ని మెయింటెయిన్ చేస్తూ వచ్చానన్నాడు. ఇతర వైద్యులు బిజీగా ఉండటం వల్ల గజిబిజీగా రాస్తారేమో గానీ, తాను మాత్రం పేషెంట్లకు అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఇలా క్యాపిటల్ లెటర్స్‌లో నీటుగా రాస్తున్నానని పేర్కొన్నాడు. తన రాత చూసి, పేషెంట్లు ప్రశంసిస్తారని, అది తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. కాగా.. నితిన్ నారాయణ్ తన ఎంబీబీఎస్ త్రిస్సూర్ మెడికల్ కాలేజీలో పూర్తి చేయగా.. జవహర్‌లాల్ ఇన్స్‌టిట్యూడ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్‌లో ఎండీ పూర్తిచేశాడు.

Exit mobile version