Site icon NTV Telugu

LIC: వాటాల విక్రయానికి కేంద్రం నిర్ణయం.. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత..!

ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా 5 శాతం వాటాను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ అసెంబ్లీ వ్యతిరేకించింది. ఐపీవోకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్‌ఐసీ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని కోరింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎల్‌ఐసీని ప్రైవేటీకరించడం లేదని, ఐపీవో ద్వారా ఐదు శాతం వాటాలను మాత్రమే విక్రయిస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోందని చెప్పారు విజయన్‌. ఇది ప్రైవేటీకరణకు తొలి అడుగు అని, ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కూడా అదేనన్నారు. ప్రైవేటు కంపెనీల దోపిడీ నుంచి పాలసీదారులను రక్షించేందుకే ఎల్‌ఐసీని జాతీయీకరించారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల వారికి కూడా బీమా చేరువైందంటే అది ఎల్‌ఐసీ చలవేనని అభిప్రాయపడ్డారు. అలాంటిది పార్లమెంట్‌లో ఎలాంటి చర్చా లేకుండా ఎల్‌ఐసీ చట్టంలో కేంద్రం మార్పులు చేసిందని విమర్శించారు కేరళ సీఎం విజయన్.

Read Also: BJP: ధర్నా చౌక్‌లో బీజేపీ దీక్ష.. పోలీసుల అనుమతి..

మరోవైపు.. కేంద్ర నిర్ణయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లాభాల్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను తమకు చేతకాదని అమ్మేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీల్లో ఒకటైన ఎల్‌ఐసీని కేంద్ర ప్రభుత్వం సిగ్గులేకుండా అమ్మేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. నష్టం వస్తే అమ్మాలి గానీ లాభాలు తెచ్చే సంస్థను భారత ప్రభుత్వం ఎందుకు అమ్మేస్తుందో మోడీ సమాధానం చెప్పాలని నిలదీశారు. అమెరికా బీమా కంపెనీలకు లాభం చేకూర్చేందుకా ఎల్‌ఐసీని అమ్మేస్తున్నారా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఇక, ఎల్‌ఐసీలో 5 శాతం వాటాల విక్రయం కోసం కేంద్రం సెబీకి దరఖాస్తు చేసింది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకు రావాల్సి ఉంది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తరుణంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దీంతో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఐపీవో రాక ఆలస్యమవుతోంది.

Exit mobile version