Kejriwal Promised 10 Lakh Jobs To Gujarat Unemployers In Campaign: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చాలాకాలం నుంచే కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పంజాబ్‌లో సక్సెస్ అయ్యారు. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ఆ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌పై కన్నేశారు. త్వరలోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో, అక్కడ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడి జనాలను తన పార్టీవైపు మళ్లించుకునేందుకు తనదైన వ్యూహాల్ని రచిస్తున్నారు. తాజాగా ఆయన ఓ కీలక హామీ ఇచ్చారు.
గిర్‌సోమ్‌నాథ్ జిల్లాలోని వెరావల్‌లో నిర్వహించిన బహిరంగసభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గుజరాత్‌లో ఆప్ అధికారంలోకి వస్తే, 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. గుజరాత్‌కు రూ. 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. మీకు ఇక్కడి ప్రభుత్వం ఏదైనా ఉచితంగా ఇచ్చిందా? అని ప్రశ్నించిన కేజ్రీవాల్.. మీకు ఉచితంగా ఏదీ ఇవ్వనప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు ఉన్నాయి? అని నిలదీశారు. అవినీతి వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా.. ఇంతకుముందే ఆయన ఉచిత నీరు – విద్యుత్తు, ఢిల్లీ మోడల్ విద్య – వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే!
