Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు

  • దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పొదుపు మంత్రం
  • పౌరులకు ప్రధాని మోడీ జాగ్రత్తలు
  • పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
Kamal Haasan

Kamal Haasan

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. అన్ని దేశాలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కూడా సీరియస్‌గా అమలవుతోంది. పౌరులంతా పొదుపు పాటించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. దీంతో మోడీ దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు.

ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకు సీనియర్ నటుడు, ఎంపీ కమల్‌హాసన్ కీలక సూచన చేశారు. ‘‘ప్రతి ప్రేమకథ తప్పనిసరిగా పారిస్‌లోనే మొదలవ్వాలా..? ప్రతి హనీమూన్‌ స్విట్జర్లాండ్‌లోనే ముగియాలా..?’’ అంటూ కమల్ హాసన్ సినీ పరిశ్రమలో వనరుల వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, ఇంధన సంక్షోభ పరిస్థితుల్లో సినీ పరిశ్రమ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అవసరం లేని విదేశీ షూటింగ్‌లు, భారీ ఖర్చులను తగ్గించి వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

స్థానిక ప్రాంతాలు, దేశీయ పర్యాటక కేంద్రాలను ప్రోత్సహించేలా సినిమాలు నిర్మిస్తే పరిశ్రమకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతుల్లా ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్‌లో అమలవుతోంది.