భారత్‌లో మరింత వేగంగా వ్యాక్సినేషన్ వేసేందుకు.. దేశంలోని వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను వాడుతూనే.. విదేశీ సంస్థలకు చెందిన వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది భారత్ ప్రభుత్వం.. అయితే, కొన్ని సంస్థలు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తన దరఖాస్తును ఉపసంహరించుకుంది… భారత్‌లో తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తును జాన్సన్ అండ్ జాన్సన్ వెనక్కి తీసుకున్నట్టు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తెలిపింది.
అయితే, ఈ పరిణామానికి గల కారణాలను ఆ సంస్థ ఇంకా వెల్లడించలేదు.. గత ఏప్రిల్‌లో భారత్‌లో దరఖాస్తు చేసుకుంది జాన్సన్ అండ్ జాన్సన్.. ఆ తర్వాత రెండు మూడు నెలల్లోనే వ్యాక్సిన్లు వస్తాయనే ప్రచారం జరిగింది. కానీ, ఆ సంస్థ మాత్రం వెనక్కి తగ్గింది. మరోవైపు.. అమెరికాలో గత ఫిబ్రవరిలోనే ఆమోదం పొందింది జే అండ్ జే సంస్థ వ్యాక్సిన్.. అయితే, ఆ వెంటనే ఈ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకడుతోందన్న వార్తలు అందరినీ హడలెత్తించాయి… ఇక, యూరప్‌లోనూ ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో నాఢీ సంబంధిత సమస్యలు వెలుగుచూసినట్టు కూడా ప్రచారం జరిగింది.. కానీ, ఆ సంస్థ మాత్రం వాటిని ఖండిస్తూ వచ్చింది.. డెల్టా వేరియంట్‌తోపాటు అన్ని వేరియంట్లపై సమర్థవంతమైన ప్రభావం చూపుతుందని చెబుతూ వచ్చారు. అయితే, భారత్‌లో దరఖాస్తు చేసుకుని.. వెనక్కి తగ్గడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.
