Site icon NTV Telugu

Saquib Nachan: ఐసిస్ ఉగ్రసంస్థ ఇండియా చీఫ్ సక్విబ్ నాచన్ మృతి..

Isis Terrorist

Isis Terrorist

Saquib Nachan: ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఇండియా ఆపరేషన్స్ చీఫ్, నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) మాజీ ఆఫీస్ బేరర్ అయిన సక్విబ్ నాచన్ మృతి చెందాడు. 57 ఏళ్ల నాచన్ బ్రెయిన్ హెమరేజ్‌తో శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో మరణించాడు. ఢిల్లీ, మహారాష్ట్రలోని పద్ఘా ప్రాంతంలో విస్తరించి ఉన్న ఐసిస్ ఉగ్రవాద మాడ్యుల్‌కు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఇతడిని 2023లో అరెస్ట్ చేసింది. ఆ తర్వాత తీహార్ జైలుకు పంపించారు. కస్టడీలో ఉన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటికే మెదడులో రక్తస్రావం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. నాలుగు రోజుల వైద్యం తర్వాత పరిస్థితి మరింత దిగజారడంతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Human trafficking: మానవ అక్రమ రవాణా కలకలం.. రూ.10 వేలకు మైనర్ బాలికను అమ్మేశారు

సాక్విబ్ అబ్దుల్ హమీద్ నాచన్ మహారాష్ట్రలోని థానే జిల్లాలోని పద్ఘా పట్టణానికి చెందినవాడు. ఇతను 1990 చివర్లో, 2000ల ప్రారంభంలో అనేక దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 2001లో నిషేధిత సిమీలో సీనియర్ వ్యక్తిగా ఎదిగాడు. ముంబై సెంట్రల్, విలే పార్లే, ములుండ్ స్టేషన్‌లలో జరిగిన పేలుళ్లతో సహా 2002, 2003లో ముంబై అంతటా జరిగిన వరుస బాంబు దాడులపై దర్యాప్తు సందర్భంగా నాచన్ పేరు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో కనీసం 13 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు.

AK-56 రైఫిల్‌తో సహా అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ కేసుల్లో అతను చివరికి దోషిగా నిర్ధారించబడ్డాడు. ఉగ్రవాద నిరోధక చట్టం (POTA) కింద పనిచేస్తున్న ప్రత్యేక కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని శిక్ష 2017లో పూర్తయింది. 2023లో భారత్ అంతటా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, మద్దతుదారులపై కఠిన చర్యల్లో భాగంగా ఎన్ఐఏ ఇతడిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ-పద్ఘా ఐసిస్ టెర్రర్ మాడ్యుల్ కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

Exit mobile version