NTV Telugu Site icon

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. కొత్త ట్విస్ట్‌లు.. ఊహకు అందని పరిణామాలు..!

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పులో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుతో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చాయి. మొదట సీబీఐ, తర్వాత ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నాయి. తొలిరోజుల్లో ఢిల్లీ సర్కారును షేక్ చేసిన లిక్కర్ స్కామ్.. తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన అరుణ్ రామచంద్రపిళ్లై కవితకు బినామీ అని వాంగ్మూలమిచ్చారని ఈడీ చెప్పింది. అయితే ఉన్నట్టుండి పిళ్లై యూటర్న్ తీసుకోవడంతో.. విచారణ ఏ మలుపు తిరగనుందనేది ఆసక్తిగా మారింది. కవితను పిళ్లైతో కలిసి విచారించాలని ఈడీ నోటీసులిచ్చింది.ఇప్పుడు పిళ్లై రివర్స్ గేర్ తర్వాత ఈడీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కలకలం రేపగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులివ్వడం హాట్ టాపిక్ అయింది. లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ పోటాపోటీ విచారణ చేస్తూ.. అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నాయి. దీంతో కేంద్రం కక్షసాధింపు చర్యలు మరోసారి నిరూపితమయ్యాయని విమర్శలు వస్తున్నాయి. అయితే అవినీతి చేసినవారెవరూ తప్పించుకోలేరని బీజేపీ గట్టిగా రిటార్ట్ ఇస్తోంది. లిక్కర్ కేసులో మొదట్నుంచీ అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. అసలు లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న విషయాలు దర్యాప్తు సంస్థలకైనా మొదట్లో తెలుసా అనే అనుమానాలు వస్తున్నాయి. విచారణ సాగుతున్నకొద్దీ ఇంకేం అంశాలు వెలుగుచూస్తాయోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కేసులో సోదాలే నెలల తరబడి సాగాయి. వేల కోట్ల రూపాయల విలువైన లిక్కర్ కాంట్రాక్ట్ కోసం వందల కోట్లు చేతులు మారాయనేది ప్రాథమిక అభియోగం. దీని కోసం సౌత్ గ్రూప్ పేరుతో జరిగిన వ్యవహారం హాట్ టాపిక్ అయింది. సౌత్ గ్రూప్ కు అసలు వ్యక్తులు.. వారి బినామీలుగా తెరముందుకు వచ్చిన ప్రతినిధులు.. ఇలా కేసు చాలా సంక్లిష్టంగా మారింది.

కేసు విచారణ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విపక్షాలు.. చట్టం తన పని తాను చేస్తుందని కాషాయ పార్టీ బదులిస్తోంది. ఒక్క లిక్కర్ కేసు చుట్టూ ఈ స్థాయిలో రాజకీయ యుద్ధం జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడేం జరుగుతుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు విచారణ, రాజకీయం కలగాపులగం కావడం కూడా తప్పుడు సంకేతాలకు తావిస్తోంది. ఓవైపు కోర్టు డైరక్షన్లు, మరోవైపు దర్యాప్తు సంస్థల ఎంక్వైరీ, ఇంకోవైపు పొలిటికల్ హీటు.. ఇలా చాలా అంశాలు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇంత జరిగినా.. అసలు స్కామ్ ఏంటి.. ఎక్కడ్నుంచి మొదలైంది అనే పిక్చర్ క్లారిటీగా లేదు. ఎవరికి తోచినట్టుగా వాళ్లు అన్వయించుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఓ ఎత్తైతే.. ఇప్పుడు పిళ్లై యూటర్న్ తీసుకోవడంతో.. ఇకముందు జరిగే విచారణ కీలకంగా మారింది. కుట్ర ఢిల్లీలో జరిగిందని ఓసారి, కాదు హైదరాబాద్ లో జరిగిందని మరోసారి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కేసులో వాస్తవాలేవో.. ఊహాగానాలేవో తెలియని దుస్థితి నెలకొంది.

లిక్కర్ కేసు రాజకీయాల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసు ఆధారంగా బీజేపీ ప్రతిపక్షాల్ని వేధిస్తోందనే వాదనను ఎస్టాబ్లిష్ చేయాలని, జాతీయ స్థాయిలో ఆ పార్టీని దోషిగా నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పనిలోపనిగా ఇదే అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ప్లాన్ చేస్తోంది. అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ అవినీతిని లిక్కర్ కేసుతో ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తోంది. కుటుంబ పాలనకు ఇంతకంటే నిదర్శనమేంటని ప్రశ్నిస్తోంది. మరి ప్రజలు బీఆర్ఎస్ వాదనతో ఏకీభవిస్తారా.. బీజేపీ ప్రచారాన్ని నమ్ముతారా అనేది తేలాల్సి ఉంది. కేసులు, రాజకీయాల సంగతి పక్కనపెడితే.. రాజకీయ పార్టీల ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజాసమస్యల్ని పెద్దగా పట్టించుకోని నేతలు.. లిక్కర్ కేసు లాంటి వాటికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రజలకు మేలు చేయడానికి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసినా తప్పు లేదు. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించడానికి వెనుకాడటం లేదు. లిక్కర్ కేసులో అసలు విషయాలేంటో బయటికి రాకుండా అందరూ జాగ్రత్తపడుతున్నారు. ఎవరికి అనుకూలమైన విషయాల్ని వారు ప్రచారం చేస్తున్నారు. దీంతో అసలేం జరిగిందో తెలియక ప్రజలు అయోమయంలో ఉంటున్నారు. ఈ గందరగోళంలో ఓట్లన్నీ గంపగుత్తగా తమకే వేయించుకోవాలనేది పార్టీల ప్లాన్.

రాజకీయ వ్యూహాల్లో నిజాలెప్పుడూ వెనకే ఉంటాయి. ప్రత్యర్థులపై అబద్ధాలైనా ఎంత బాగా ప్రచారం చేయగలిగితే ఎన్నికల్లో అంత ఉపయోగమనేది పార్టీల భావన. ఈ కోణంలో చూస్తే రాజకీయ పార్టీలు ఏ కేసులోనూ నిజానిజాల్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇప్పుడు లిక్కర్ కేసైనా అంతే. తమకు రాజకీయంగా వేస్ట్ అనిపిస్తే.. ఎన్ని వేల కోట్లు చేతులు మారినా ఎవరూ పట్టించుకోరు. కానీ రాజకీయం చేసే అవకాశం ఉందనిపిస్తే చాలు.. అసలు కేసే లేకపోయినా.. సృష్టించడానికి క్షణం కూడా ఆలోచించరు. అదేంటి.. రాజకీయ పార్టీలు ఏమనుకుంటే ఏం.. దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా అని అనుకునే పరిస్థితి కూడా లేదు. అవి ఎప్పుడో రాజకీయ నేతలు చెప్పినట్టుగా ఆడే సంస్థలుగా మారాయనే విమర్శలు ఉండనే ఉన్నాయి. అలాంటప్పుడు అసలు నిజాలు ఎవరు చెప్తారు.. ఎలా తెలుస్తాయనేది అంతుచిక్కని ప్రశ్న. కోర్టులు కేసును సీరియస్ గా తీసుకున్నా.. విచారణ వేగవంతం చేయాలని టార్గెట్ పెట్టినా.. అప్పుడు విచారణ తీరు వేరే ఉంటుంది. అదే నార్మల్ గా అయితే కేసుల్ని సాగదీయడమే.. లేకపోతే రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా కేసు క్లోజ్ చేయడమో జరుగుతోంది.