Site icon NTV Telugu

Excess Luggage Rules: రైళ్లలో ఎక్కువ లగేజీ తీసుకెళ్తున్నారా.. మీకు ఇది బ్యాడ్ న్యూసే..

Untitled Design (13)

Untitled Design (13)

రైళ్లలో అవసరానికి మించి లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులకు ఇది కీలక సమాచారం. ఇకపై నిర్ణయించిన లగేజీ పరిమితిని మించి సామాను తీసుకెళ్తే తప్పనిసరిగా అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని భారత రైల్వే స్పష్టం చేసింది. విమాన ప్రయాణాల్లో ఉన్నట్లే, రైలు ప్రయాణాల్లో కూడా లగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

సాధారణంగా చాలా మంది రైలు ప్రయాణాన్ని సౌకర్యవంతమైనదిగా, తక్కువ ఖర్చుతో కూడినదిగా భావిస్తారు. అందుకే ఇతర ప్రయాణ మార్గాల కంటే రైల్వేను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అయితే, రైళ్లలో అవసరానికి మించి లగేజీ తీసుకెళ్లడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లగేజీ పరిమితి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణ తరగతిని బట్టి ఇప్పటికే నిర్దిష్ట ఉచిత లగేజీ పరిమితి ఉందని తెలిపారు. ఆ పరిమితిని మించి లగేజీ తీసుకెళ్తే తప్పనిసరిగా అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అవసరానికి మించి సామాను తీసుకెళ్లడం రైలు ప్రయాణ భద్రతకు ముప్పుగా మారుతుందని కూడా ఆయన హెచ్చరించారు.

రైల్వే నిబంధనల ప్రకారం, సెకండ్ క్లాస్ ప్రయాణికులు గరిష్టంగా 35 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితిని మించి లగేజీ తీసుకెళ్లాలంటే గరిష్టంగా 70 కిలోల వరకు అనుమతి ఉంటుంది. అయితే, అదనపు బరువుకు సంబంధించి నిర్ణయించిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కొంత వెసులుబాటు ఉంది. వారు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా 40 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు. అవసరమైతే 80 కిలోల వరకు సామాను తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, ఆ పరిమితిని మించిన బరువుకు మాత్రం అదనపు రుసుము చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు.

Exit mobile version