ఇండియన్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. సాధారణంగా రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రయాణించే రోజున టికెట్లు దొరకక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సౌకర్యం అత్యవసర ప్రయాణాలు చేసే వారికి, చివరి నిమిషంలో ప్రయాణం ప్లాన్ చేసుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
రైలు బయలుదేరే సమయానికి ముందుగా చార్ట్ తయారీ ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా ట్రైన్ బయలుదేరే నాలుగు గంటల ముందు మొదటి చార్ట్ తయారవుతుంది. చివరి చార్ట్ మాత్రం రైలు స్టేషన్ నుంచి బయలుదేరే 30 నిమిషాల ముందు రూపొందుతుంది. ఆ సమయంలో సీట్లు ఖాళీగా ఉంటే, ప్రయాణికులు ‘కరెంట్ బుకింగ్’ విధానంలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. అంటే రైలు ప్రయాణానికి అరగంట ముందు వరకు కూడా టికెట్ పొందే అవకాశం ఉంటుంది.
ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ-టికెట్ రూపంలో బుక్ చేసుకోవచ్చు. అలాగే రైల్వే స్టేషన్‌లలోని టికెట్ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు పొందవచ్చు. బుకింగ్ చేసేముందు సీటు అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా ఈ టికెట్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. సాధారణ టికెట్ ధరే వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
