Site icon NTV Telugu

Indian Army Kite: భారత సైన్యం కొత్త ఆయుధం.. గద్దలతో డ్రోన్లపై ధ్వజం

Indian Kite Arjun

Indian Kite Arjun

Indian Army trained birds to knockdown airborne enemy drones: ఈమధ్య భారత భూభాగంలోకి పాకిస్తానీ డ్రోన్‌ల చొరబాటు బాగా పెరిగింది. ఈ ఏడాదిలో సరిహద్దు వెంబడి 230కి పైగా డ్రోన్లు కనిపించాయి. రీసెంట్‌గానే పంజాబ్‌లోని భారత్, పాకిస్తాన్ సరిహద్దులో రెండు డ్రోన్లు తీవ్ర కలకలం రేపాయి. అమృత్‌సర్ జిల్లాలోని చన్నా పఠాన్ ప్రాంతంలోనూ మరో డ్రోన్ కనిపించింది. ఈ నేపథ్యంలోనే శత్రు దేశాల డ్రోన్ల పనిపట్టేందుకు.. భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. గాల్లోనే డ్రోన్లను వేటాడి, కూల్చేసేలా.. గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆర్మీలో ఇలాంటి కార్యక్రమం ఇదే మొదటిసారి.

ఉత్తరాఖండ్‌లోని ఔలీలో చైనా సరిహద్దుల వద్ద భారత్, అమెరికా సంయుక్తంగా ‘యుద్ధ్ అభ్యాస్’ పేరిట యుద్ధ విన్యాసాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా.. గద్దలతో డ్రోన్లను కూల్చేసే ట్రైనింగ్‌ ఫలితాలను ప్రదర్శించారు. తొలుత ఒక డ్రోన్‌ను గాల్లో ఎగురవేశారు. దాని శబ్దాన్ని ఒక ఆర్మీ శునకం గ్రహించి.. సిబ్బందిని అప్రమత్తం చేసింది. అప్పుడు అర్జున్ అనే గద్దను గాల్లోకి పంపగా.. అది డ్రోన్ ఆచూకీని కనుగొని, దాన్ని కూల్చేసింది. డ్రోన్లను వేటాడేలా ‘అర్జున్’కి భారత ఆర్మీ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆర్మీ ఇప్పటికే శునకాలు, గద్దలకు శిక్షణ ఇచ్చి.. ఆయా సైనిక కార్యకలాపాలకు వాటిని వినియోగిస్తోంది. అయితే.. శత్రు డ్రోన్లను వేటాడేందుకు గద్దలను ఉపయోగించడం ఇదే తొలిసారి.

మరోవైపు.. యుద్ధ్ అభ్యాస్‌లో భాగంగా భారత ఆర్మీ దళాలు ఎంఐ-17 హెలికాప్టర్ నుంచి స్లిదరింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. ఉమ్మడి విన్యాసాల్లో భారత సైన్యం.. సైనికుల నిరాయుధ పోరాట నైపుణ్యాలను కూడా ప్రదర్శించింది. రెండు దేశాల సైన్యాల మధ్య అత్యుత్తమ అభ్యాసాలు, వ్యూహాలు, సాంకేతికతలు, విధానాలను పరస్పరం మార్చుకునే లక్ష్యంతో.. భారతదేశం, అమెరికా మధ్య ప్రతి సంవత్సరం యుద్ధ్ అభ్యాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Exit mobile version