India economy: భారతదేశం 4.18 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రభుత్వం తెలిపింది. 2030 నాటికి జర్మనీని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వృద్ధి రేటుతో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది.
2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడీపీ 8.2 శాతం వృద్ధి చెందింది. ఇది మొదటి త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం, గత ఆర్థిక సంవత్సరంలో నాలుగవ త్రైమాసికంలో నమోదైన 7.4 శాతం కన్నా ఎక్కువ. ‘‘4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో, భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్ల అంచనా జీడీపీతో రాబోయే 2.5 నుండి 3 సంవత్సరాలలో జర్మనీని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉంది’’ అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
Read Also: Pakistan: అత్యంత రహస్యంగా అసిమ్ మునీర్ కుమార్తె వివాహం.. ఎవరితో జరిగిందంటే..
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఉంటే, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో జర్మనీ, ఇప్పుడు నాలుగో స్థానంలో భారత్ ఉంది. ప్రపంచ బ్యాంకు 2026లో భారత జీడీపీని 6.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. 2026లో 6.4 శాతం, 2027లో 6.5 శాతం వృద్ధితో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీ-20 ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని మూడీస్ అంచనా వేస్తోంది. ఐఎంఎఫ్ 2025 సంవత్సరానికి తన అంచనాలను 6.6 శాతానికి, 2026 సంవత్సరానికి 6.2 శాతానికి పెంచింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 2025లో ఇండియా వృద్ధిని 7.2 శాతానికి పెంచింది. బలమైన దేశీయ వినియోగం, పట్టణ ప్రాంతాల్లో ఖర్చు పెరగడం, గ్లోబల్ ట్రేడ్ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వం కొనసాగడం భారత వృద్ధికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
